China: మరీ ఇంత స్వార్థమా..? అణుజలాల విడుదలపై చైనా ఆగ్రహం

జపాన్‌ (Japan) అణు జలాలను పసిఫిక్‌ సముద్రంలోకి విడుదల చేయడం మొదలుపెట్టింది. ఈ చర్యను చైనా ఖండించింది.

Published : 24 Aug 2023 13:17 IST

బీజింగ్‌: జపాన్‌ (Japan) అణు జలాలను పసిఫిక్‌ మహా సముద్రంలోకి విడుదల చేస్తుండటంపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అది స్వార్థపూరిత చర్య అని మండిపడింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

‘మహా సముద్రం మానవాళి ఆస్తి. ప్రజా ప్రయోజనాలు పట్టించుకోకుండా బలవంతంగా అందులోకి ఈ నీటిని విడుదల చేస్తున్నారు. ఇది అత్యంత స్వార్థపూరిత, బాధ్యతారాహిత్య చర్య. అణు జలాలను శుద్ధి చేసే పరికరం  సామర్థ్యాన్ని దీర్ఘకాలంలో జపాన్ నిరూపించలేదు’ అని వెల్లడిస్తూ చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ చర్యతో జపాన్‌ మానవాళిని ప్రమాదంలోకి నెడుతోందని, భవిష్యత్తు తరాలకు సమస్యలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే జపాన్‌కు చెందిన పలు ప్రాంతాల నుంచి ఎగుమతి అయ్యే ఆహారపదార్థాలపై నిషేధం విధించింది. 

పసిఫిక్‌ సముద్రంలోకి అణుజలాలు విడుదల మొదలు..!

2011లో ఫుకుషిమా(Fukushima) అణుకేంద్రం సునామీ కారణంగా దెబ్బతిన్న నాటి నుంచి ఈ అణు వ్యర్థ జలాలను భారీ ట్యాంకుల్లో నిల్వ చేసింది. ఇక్కడ మొత్తం 1.34 మిలియన్‌ టన్నుల అణు జలాలు ఉన్నాయి. వీటిల్లో నేడు 200 నుంచి 210 క్యూబిక్‌ మీటర్ల నీటిని శుద్ధి చేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. రేపటి నుంచి రోజుకు 456 క్యూబిక్‌ మీటర్ల నీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని టోక్యో ఎలక్ట్రిక్‌ పవర్‌ కంపెనీ (టెప్కో) వెల్లడించింది. ఏదైనా అసాధారణ ఫలితాలు కనిపిస్తే తక్షణమే నీటి విడుదలను నిలిపివేసి దర్యాప్తు చేపడతామని కంపెనీ వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు