Japan: పసిఫిక్‌ సముద్రంలోకి అణుజలాలు విడుదల మొదలు..!

జపాన్‌ అణు జలాలను పసిఫిక్‌ సముద్రంలోకి విడుదల చేయడం మొదలుపెట్టింది. అక్కడ మత్స్యసంపద, ప్రజల జీవితాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని చైనా, దక్షిణ కొరియాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

Updated : 24 Aug 2023 13:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జపాన్‌ (Japan) అణు జలాలను పసిఫిక్‌ సముద్రంలోకి విడుదల చేయడం మొదలుపెట్టింది. 2011లో ఫుకుషిమా (Fukushima) అణుకేంద్రం సునామీ కారణంగా దెబ్బతిన్న నాటి నుంచి ఈ నీటిని భారీ ట్యాంకుల్లో నిల్వ చేసింది. ఇక్కడ మొత్తం 1.34 మిలియన్‌ టన్నుల అణు జలాలు ఉన్నాయి. వీటిల్లో నేడు 200 నుంచి 210 క్యూబిక్‌ మీటర్ల నీటిని శుద్ధి చేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. రేపటి నుంచి రోజుకు 456 క్యూబిక్‌ మీటర్ల నీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని టోక్యో ఎలక్ట్రిక్‌ పవర్‌ కంపెనీ (టెప్కో) వెల్లడించింది. ఏదైనా అసాధారణ ఫలితాలు కనిపిస్తే తక్షణమే నీటి విడుదలను నిలిపివేసి దర్యాప్తు చేపడతామని కంపెనీ తెలిపింది. గురువారం మధ్యాహ్నం ఒక బోటును పంపించి నీటి నమూనాలను సేకరిస్తామని టెప్కో చెబుతోంది.

సునామీలో రియాక్టర్‌ దెబ్బతిన్న నాటి నుంచి జపాన్‌ ఈ అణుజలాలను నిల్వచేసి ఉంచింది. కానీ, ఇప్పుడు నిల్వకు చోటు సరిపోని పరిస్థితికి చేరుకొంది. దీంతో వీటిని వివిధ దశల్లో శుద్ధి చేసి రానున్న కొన్నేళ్లపాటు సముద్రంలోకి విడుదల చేయనున్నారు. ఈ ప్లాంట్‌ను మూసివేయాలంటే నీటి విడుదల చేయాల్సిందే. టెప్కో ఈ నీటిని వడగట్టి 60 రకాల రేడియో యాక్టివ్‌ పదార్థాలను తొలగిస్తోంది. కానీ, ఈ నీటిలో ట్రీటియం, కార్బన్‌-14 మూలకాలు ఉంటాయని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

విమాన ప్రమాదంలో ప్రిగోజిన్‌ మృతి!

2011లో సుమారు 9 తీవ్రతతో వచ్చిన భూకంపం ఈ ప్లాంట్‌ను దెబ్బతీసింది. అప్పట్లో అధికారులు సుమారు 1.50 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. తాజాగా ఈ నీటి విడుదల ఆసియా-పసిఫిక్‌ దేశాల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఈ నీటి కారణంగా ఇక్కడి మత్స్య సంపదకు డిమాండ్‌ పడిపోతుందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జపాన్‌ అణు వ్యర్థ జలాలను పసిఫిక్‌ సముద్రంలో కలపడంపై చైనా, దక్షిణ కొరియా దేశాలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే సియోల్‌లో దీనిపై ఆందోళనలు జరుగుతున్నాయి. జపాన్‌లో కూడా ఈ నీటి విడుదలను వివిధ వర్గాలు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టాయి. రానున్న 17 రోజుల్లో జపాన్‌ మొత్తం 7,800 క్యూబిక్‌ మీటర్ల రేడియోయాక్టివ్‌ జలాలను నీటిలోకి విడుదల చేయనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని