China: ఆత్మహత్యా..? చిత్రహింసలు పెట్టి చంపేశారా..?: అదృశ్యమైన చైనా నేతపై కథనాలు

చైనా విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో అదృశ్యమైన కిన్‌గాంగ్‌(Qin Gang)..ప్రాణాలతో లేరని తెలుస్తోంది.

Updated : 07 Dec 2023 17:06 IST

బీజింగ్‌: ప్రభుత్వాన్ని ధిక్కరించిన ప్రముఖులు అదృశ్యమైన ఘటనలు చైనా(China)లో అనేకం కనిపిస్తాయి. అలా మిస్ అయిన వ్యక్తే కిన్‌ గాంగ్‌. ఆయన సాక్షాత్తూ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే జాడ లేకుండా పోయారు. అయితే ఆయన చనిపోయి ఉంటారని పలు అంతర్జాతీయ వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకోవడమో లేక  చిత్రహింసల వల్ల మరణించి ఉండొచ్చని రాసుకొచ్చాయి. జులై నెలలోనే బీజింగ్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో ఆయన మృతి చెందారని చైనా ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలున్న ఇద్దరు వ్యక్తులను ఉటంకించాయి. ఆ ఆసుపత్రిలో చైనాలోని ఉన్నతస్థాయి వ్యక్తులకు మాత్రమే చికిత్స అందిస్తారట.

కిన్‌గాంగ్‌(Qin Gang) గతేడాది డిసెంబరులోనే విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు అమెరికాలో చైనా(China) రాయబారిగా ఉన్న ఆయనకు.. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ స్వయంగా పదోన్నతి కల్పించారు. ఆ తర్వాత కొద్దినెలల నుంచే ఆయన అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం మానేశారు. చివరిసారిగా ఈ ఏడాది జూన్‌లో బీజింగ్‌లో జరిగిన సమావేశంలో శ్రీలంక, వియత్నాం, రష్యా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. తర్వాత నుంచి ఆయన ఎక్కడా కనిపించలేదు. అనారోగ్య కారణాలతో ఆయన రాలేదని అప్పట్లో విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొద్దిరోజుల తర్వాత ఆయన పదవి కూడా పోయింది. ఆయన స్థానంలో వాంగ్‌ యీని నియమించింది.

‘మీరే ఇజ్రాయెల్‌ను అడ్డుకోగలరు’.. పాక్‌ మద్దతు కోరిన హమాస్‌..!

టీవీ జర్నలిస్టు ఫుషియోన్‌తో వివాహేతర బంధమే కిన్‌ గాంగ్‌ కనిపించకుండా పోవటానికి కారణమని వార్తలు వచ్చాయి. ఫుషియోన్‌ హాంకాంగ్‌లోని ఫినిక్స్‌ టెలివిజన్‌కు పనిచేసేవారు. ప్రపంచంలోని రాజకీయ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసే ఆమె కార్యక్రమం బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో భాగంగా 2022 మార్చిలో ఆమె కిన్‌గాంగ్‌నూ ఇంటర్వ్యూ చేశారు. అదే ఆమె చివరి ఇంటర్వ్యూ కూడా. ఆమె చైనా(China)లో జన్మించారు. అమెరికా పౌరసత్వం ఉంది. కిన్‌గాంగ్‌ ద్వారా ఆమెకు ఒక కుమారుడు జన్మించినట్లు కొన్ని కథనాలు పేర్కొన్నాయి. ఆమెతో పాటు కుమారుడు కూడా కనిపించటం లేదని వెల్లడించాయి.

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు కిన్‌గాంగ్‌(Qin Gang) అత్యంత సన్నిహితుడు. ఆయన అండతోనే చైనా విదేశాంగ విధానంలో అత్యంత బలీయమైన నేతగా ఎదిగారాయన. కిన్‌గాంగ్‌(Qin Gang) 1988లో చైనా విదేశాంగశాఖలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగారు. రెండుదఫాలు చైనా విదేశాంగ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. జిన్‌పింగ్‌ అధ్యక్షుడయ్యాక చకచకా కీలక స్థానాల్లోకి ఎదిగారు. 2021లో స్వల్పకాలంపాటు అమెరికా రాయబారిగా నియమితుడై... 2022లో అనేకమంది సీనియర్లను కాదని విదేశాంగశాఖ మంత్రిగా పదోన్నతి పొందారు. పాశ్చాత్యదేశాల్లో చైనా పట్ల ఉన్న వ్యతిరేకతను బలంగా తిప్పికొట్టిన నేతగా పేరుంది. ఎదురుదాడిలో దిట్ట. ఇంగ్లిష్‌ బాగా మాట్లాడతారు. అయితే విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకు ఆయన అమెరికన్లపై ప్రశంసలు కురిపించడం అప్పట్లో వైరల్‌ అయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని