China-Taiwan: కొత్త అధ్యక్షుడి ప్రసంగం ఎఫెక్ట్‌.. తైవాన్‌కు చైనా ‘పనిష్మెంట్‌’..!

China-Taiwan: తైవాన్‌ ద్వీపాన్ని చైనా బలగాలు భారీగా చుట్టుముట్టాయి. నలువైపులా భారీ ఎత్తున సైనిక విన్యాసాలు మొదలుపెట్టాయి.

Updated : 23 May 2024 13:32 IST

బీజింగ్‌/తైపీ: తైవాన్‌ (Taiwan), చైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ ద్వీపంలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా (China) వ్యతిరేకిగా పేరొందిన లాయ్‌ చింగ్‌-తె విజయం సాధించిన సంగతి తెలిసిందే. గత సోమవారమే ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లాయ్‌ (new President Lai Ching-te).. తమను బెదిరించడం ఆపాలంటూ డ్రాగన్‌కు గట్టిగా చెప్పారు. దీంతో ఆగ్రహించిన బీజింగ్‌.. తైవాన్‌ చుట్టూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. ‘పనిష్మెంట్‌’ (Punishment Drills) పేరుతో వీటిని నిర్వహిస్తోంది.

గురువారం ఉదయం 7.45 గంటల ప్రాంతంలో ఈ ద్వీపం చుట్టూ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (PLA)కి చెందిన ఈస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌ మిలిటరీ డ్రిల్స్‌ (Military Drills) ప్రారంభించిందని చైనా అధికారిక మీడియా వెల్లడించింది. ‘‘స్వాతంత్ర్యం కోసం తైవాన్‌ దళాల వేర్పాటువాద చర్యలకు శిక్షగానే మేం ఈ విన్యాసాలు చేపట్టాం. మా విషయంలో బయటి శక్తుల (అమెరికాను ఉద్దేశిస్తూ) జోక్యం, రెచ్చగొట్టే చర్యలకు ఇది మా హెచ్చరిక’’ అని ఈ కమాండ్‌ అధికార ప్రతినిధి లి షీ వెల్లడించారు.

బస్సుల వలే విమానాల్లో ఆ కుదుపులెందుకు..!

తైవాన్‌ జలసంధితో పాటు ఈ ద్వీపం మిగిలిన మూడు దిక్కుల్లో డ్రాగన్‌ రెండు రోజుల పాటు ఈ విన్యాసాలు కొనసాగించనుంది. ఆర్మీ, నేవీ, వాయుసేన, రాకెట్‌ దళాలు సంయుక్తంగా ఇందులో పాల్గొన్నాయి. లక్ష్యాలపై తమ దాడుల శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నాయి.

అలర్ట్‌ అయిన తైవాన్‌..

చైనా విన్యాసాల నేపథ్యంలో తైవాన్‌ అప్రమత్తమైంది. పరిస్థితులు తీవ్రంగా మారితే తక్షణమే ప్రతిస్పందించేందుకు వీలుగా యుద్ధ విమానాలను, క్షిపణులను సిద్ధంగా ఉంచింది. నేవీ, ఆర్మీ యూనిట్లను అలర్ట్‌ చేసింది. ఈ డ్రిల్స్‌ను తైవాన్‌ రక్షణ మంత్రి తీవ్రంగా ఖండించారు. ‘‘డ్రాగన్‌ అసంబద్ధ రెచ్చగొట్టే చర్యలు ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి. మేం ఘర్షణలను కోరుకోవడం లేదు. కానీ ముప్పు ముంచుకొస్తే దేనికీ భయపడం’’ అని స్పష్టం చేశారు.

శాశ్వత స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేందుకు ప్రయత్నిస్తున్న తైవాన్‌లో ఇటీవల నూతన అధ్యక్షుడు లాయ్‌ చింగ్‌-తె తన ప్రసంగంలో చైనాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మమ్మల్ని భయపెట్టడం ఆపండి. సైన్యంతో రెచ్చగొట్టాలని చూడకండి. మా దేశ సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్యానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. తైవాన్‌ జలసంధిలో యథాతథ స్థితి ఉండేలా మేం కృషి చేస్తాం’’ అని అన్నారు. ఈ ద్వీపం తమ భూభాగమేనంటూ గత కొన్నేళ్లుగా వాదిస్తున్న డ్రాగన్‌కు ఈ వ్యాఖ్యలు మింగుడుపడలేదు. ఈ క్రమంలో ప్రతిచర్యకు దిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు