Wagner - Russia: వాగ్నర్‌ గ్రూప్‌ తిరుగుబాటులో మా పాత్ర లేదు.. స్పష్టం చేసిన అమెరికా

కిరాయి సైన్యం రష్యా (Russia)పై తిరుగుబాటు చేపట్టడంలో తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా (USA) స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ విలియం బర్న్స్‌ రష్యా గూఢచారి చీఫ్‌ సెర్గీ నారిష్కిన్‌కు తెలియజేశారు. 

Updated : 01 Jul 2023 19:34 IST

వాషింగ్టన్‌: రష్యాపై కిరాయి సైన్యం (Wagner Mutiny) తిరుగుబాటుతో తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా (America) మరోమారు స్పష్టం చేసింది. ఈ మేరకు రష్యా (Russia) గూఢచారి చీఫ్‌ సెర్గీ నారిష్కిన్ (Sergei Naryshkin)కు అమెరికాకు సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (CIA) డైరెక్టర్‌ విలియం బర్న్స్‌ (William Burns) శుక్రవారం తెలియజేశారు.

వారం క్రితం కిరాయి సైన్యమైన వాగ్నర్‌ గ్రూపు తిరుగుబాటు చేపట్టి రష్యాను కలవరపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ గ్రూపు అకస్మాత్తుగా వెనక్కి తగ్గడం గమనార్హం. ఆ సమయంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) అప్రమత్తమయ్యారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌, జర్మనీ ఛాన్స్‌లర్‌ షోల్జ్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌తో ఫోన్‌ కాల్‌లో మాట్లాడారు. రష్యాలో వాగ్నర్‌ గ్రూప్‌ తిరుగుబాటు విషయంలో పశ్చిమ దేశాల జోక్యం ఉందంటూ పుతిన్‌ (Putin) చేస్తున్న ఆరోపణలకు ఎటువంటి బలం చేకూర్చకుండా చూడటం ముఖ్యమని బైడెన్‌ నొక్కి చెప్పారని శ్వేత సౌధం వర్గాలు అప్పుడు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రిగోజిన్‌ వ్యూహాలు అమెరికాకు ముందే తెలుసన్నట్లు స్థానిక మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

తాజాగా ఆ ఆరోపణలను, మీడియా కథనాలను అమెరికా తోచిపుచ్చింది. రష్యాపై కిరాయి సైన్యం చేపట్టిన తిరుగుబాటులో తమకు ఎలాంటి పాత్ర లేదని నారిష్కిన్‌కి విలియం బర్న్స్‌ ఫోన్‌లో తెలియజేశారు. కిరాయి సైన్యం తిరుగుబాటు రష్యా పోరాటంలో భాగమని.. దీంట్లో అమెరికాకు గాని, మిత్ర దేశాల కానీ ఎలాంటి ప్రమేయం లేదని ఇటీవల జో బైడన్ కూడా స్పష్టం చేసిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని