the San Jose: 200 టన్నుల బంగారంతో నీట మునిగిన నౌక.. సముద్రగర్భంలో నిధి కోసం ముమ్మర వేట..!

దాదాపు 200 టన్నుల బంగారం, రత్నాలతో ప్రయాణిస్తున్న ఓ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఓవైపు ఆ సంపద కోసం న్యాయపోరాటం జరుగుతుండగానే.. ఆ నిధిని వెలికితీసేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి.

Published : 25 May 2024 00:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టన్నుల కొద్దీ బంగారం, రత్నాలతో స్పానిష్‌కు బయల్దేరిన ఓ నౌక దాదాపు 300 ఏళ్ల క్రితం శత్రు దాడిలో దెబ్బతిని సముద్రంలో మునిగిపోయింది. నాటినుంచి అత్యంత విలువైన ఆ నిధి సముద్రగర్భంలోనే నిక్షిప్తమై ఉంది. కొన్నేళ్ల కిందట దానిని గుర్తించినా.. వాటాల్లో తేడా వచ్చి ఎవరూ వెలికి తీయలేదు. తాజాగా దానిని దక్కించుకొనేందుకు ఓ దేశం వేగంగా పావులు కదుపుతుండటం వార్తల్లో నిలిచింది. 

కరేబియన్‌ సముద్రంలో మునిగిన శాన్‌జోస్‌ అనే పురాతన నౌకను తాము పరిశోధించడం మొదలుపెడతామని కొలంబియా ఇటీవల ప్రకటించింది. ఈ ప్రకటనతో అమెరికా, స్పెయిన్‌, పెరూ సహా పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇందుకో కారణం ఉంది. 1708వ సంవత్సరంలో స్పెయిన్‌కు చెందిన నౌక పెరూలోని దాదాపు 200 టన్నుల బంగారం, వెండి, రత్నాలను తీసుకొని కొలంబియాకు బయల్దేరింది. తూర్పున ఉన్న కరీబియన్‌ తీర నుంచి ప్రయాణం మొదలు పెట్టిన ఈ నౌకపై శత్రువులు దాడి చేయడంతో 600 మంది సిబ్బందిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఆ సంపద మొత్తం నాటినుంచి సముద్రగర్భంలో 600 మీటర్ల లోతున నౌక శిథిలాల కిందే ఉండిపోయింది. దీనికి ఉన్న దాదాపు 64 భారీ రాగి తుపాకులు కూడా అక్కడే పడిపోయి ఉన్నాయి. ఆ సమయంలో ఈ నౌకతో పాటు బంగారంతో ఉన్న మరో నౌక దాడి నుంచి తప్పించుకొంది. 

తాజాగా కొలంబియా ప్రభుత్వం ఈ నిధి నిక్షిప్తమై ఉన్న ఓడపై పరిశోధన చేపట్టినట్లు ఇటీవల ప్రకటించింది. దీనిలోభాగంగా ది కొలంబియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంత్రోపాలజీ అండ్‌ హిస్టరీ (ఐసీఏఎన్‌హెచ్‌) సంస్థ ప్రత్యేకమైన రిమోట్‌ సెన్సర్లను వాడి నౌకను ఫొటోగ్రఫీ చేయనుంది. దీని ఆధారంగా తర్వాత శోధన కొనసాగుతుందని పేర్కొంది. అనంతరం ఈ నౌక నుంచి పురాతన వస్తువులు, సంపదను వెలికితీస్తాయన్నారు. ఇక ఈ నౌక మునిగిపోయిన ప్రదేశాన్ని ఇప్పటికే ఐసీఏఎన్‌హెచ్‌ రక్షిత పురాతత్వ ప్రదేశంగా ప్రకటించింది. 

అసలు ఈ సంపదపై హక్కులు ఎవరివీ..

1981లో అమెరికాకు చెందిన సముద్ర గర్భాన్వేషణ సంస్థ సీసెర్చి ఆర్మడా(ఎస్‌ఎస్‌ఏ) ఈ నౌక శకలాలు కనుగొన్నట్లు ప్రకటించింది. కొలంబియా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైంది. ఆ దేశ పార్లమెంట్‌ ఈ నిధిపై పూర్తి హక్కును ప్రకటించింది. కేవలం 5శాతం ఫీజు కింద ఎస్‌ఎస్‌ఏ సంస్థకు ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో ఆ సంస్థ అమెరికా కోర్టులో కేసు వేయగా.. రెండుసార్లు ఆ సంపదపై కొలంబియాదే హక్కు అని తేల్చిచెప్పింది. 

ఆ తర్వాత 2015లో తాము శాన్‌జోస్‌ నౌక శకలాలను స్వయంగా కనుగొన్నామని కొలంబియా ప్రకటించింది. భారీ రాగి తుపాకులు వంటి పరికరాలు అక్కడ ఉన్నట్లు పేర్కొంది. ఇందుకోసం బ్రిటిష్‌, అమెరికా కంపెనీల సాయం తీసుకొన్నట్లు వెల్లడించింది. దీంతో ఎస్‌ఎస్‌ఏ సంస్థ పర్మినెంట్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌లో 10 బిలియన్‌ డాలర్లకు కొలంబియాపై కేసు వేసింది. మరోవైపు స్పెయిన్‌, పెరూ ప్రభుత్వాలు కూడా ఆ నౌకపై యాజమాన్య హక్కులు తమవే   అని చెబుతున్నాయి. కానీ, ఈ నౌక మునిగిపోయిన ప్రాంతాన్ని కొలంబియా, ఎస్ఎస్‌ఏ కంపెనీ ఇప్పటివరకు అత్యంత గోప్యంగా ఉంచాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని