Darien Gap: అక్కడ అత్యాచారాలు నిత్యకృత్యం.. శరణార్థులపై దారికాచి అఘాయిత్యాలు!

కొలంబియా, పనామాకు మధ్యలో అటవీ ప్రాంతం ఉంటుంది. దీన్నే డేరియన్‌ గ్యాప్‌ అంటారు. ఈ దారిలో డ్రగ్స్‌ ముఠాలు మహిళలపై పడి అత్యాచారాలకు పాల్పడుతుంటాయి.

Published : 24 May 2024 00:16 IST

Darien Gap | ఇంటర్నెట్‌ డెస్క్‌: చుట్టూ అడవి.. ఒక వందమంది వరకు ఉంటారు.. అందరి కళ్లలో దైన్యం.. ఆకలి తీర్చుకోవడం కోసం పుట్టిన గడ్డను వదిలి అమెరికాలో ఏదైనా ఉపాధి దొరుకుతుందన్న ఆశతో అన్నింటికీ తెగించి అక్రమ మార్గాల్లో వెళ్లేందుకు నడుస్తున్నారు. వీరిలో మహిళలుంటే అత్యంత తీవ్రమైన సమస్య పొంచి ఉంటుంది. దారిలో డ్రగ్స్‌ ముఠాలు వీరిపై పడి అత్యాచారాలకు పాల్పడుతుంటాయి. వీరిని ఎదిరించే ధైర్యం ఎవరికీ ఉండదు. ఎదిరిస్తే ప్రాణాలు తీసేస్తారు. అందుకనే మానవ రవాణా స్మగ్లర్ల సూచన మేరకు ప్రతి మహిళ కచ్చితంగా గర్భ నిరోధకాలను వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి. కనీసం గర్భం దాల్చకుండా ఉంటామన్న ఆశ. అలాంటి దుర్భర పరిస్థితుల్లో మహిళలు భీతావహమైన దారిలో ప్రయాణం సాగిస్తుంటారు.

ఎక్కడ ఉందీ దారి..?

కొలంబియా, పనామాకు మధ్యలో అటవీ ప్రాంతం ఉంటుంది. దీన్నే డేరియన్‌ గ్యాప్‌ (Darien Gap) అంటారు. కొలంబియాలో ఈ ప్రాంతం మాదక ద్రవ్యాల ముఠాల అధీనంలో ఉంటుంది. మనిషికి ఇంత అని డబ్బు తీసుకొని ఇక్కడికి పంపిస్తారు. కేవలం డేరియన్‌లోనే కాదు అమెరికా సరిహద్దు దేశమైన మెక్సికోకు చేరుకునే వరకు మహిళలకు ఎటువంటి రక్షణ ఉండదు. వీరిని తీసుకువెళ్లే గైడ్లు.. మహిళల సంచుల్లో కండోమ్‌ ప్యాకెట్లు ఉంచుతారు. రౌడీమూకలు అడ్డగిస్తే ఏ మాత్రం ప్రతిఘటించకుండా లొంగిపొమ్మని కోరతారు.

బోర్గ్‌ డ్రింకింగ్‌.. అమెరికా యువతను మత్తెక్కిస్తున్న కొత్త ట్రెండ్‌!

అమెరికాకు అక్రమంగా చేరుకోవాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే. కొలంబియా, పనామా, కోస్తారికా, నికరాగువా, హోండురాస్‌, గ్వాటిమెలా, మెక్సికోలు దాటాలి. మాన, ప్రాణాలకు ఎలాంటి గ్యారంటీ ఉండదు. ప్రత్యేకించి దక్షిణ అమెరికా, సెంట్రల్‌ అమెరికా దేశాలకు చెందిన వేలాదిమంది ఇలాంటి మార్గాల్లో ప్రయాణిస్తుంటారు. మార్గమధ్యంలో అనేకమంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ దారిలో (Darien Gap) అనేక నదులు, అరణ్యాలు, ఎడారులు ఉంటాయి. 

ఎలాగోలా చేరినా దొరికిపోతారు..

ఇలా మెరుగైన జీవితం కోసం నిత్యం వేలాదిమంది అభాగ్యులు సవాళ్లను ఎదుర్కొంటూ పయనం సాగిస్తుంటారు. తీరా మెక్సికో దాటినా అక్కడ అమెరికా దళాలు పట్టుకొని తిరిగి వారి స్వదేశాలకు పంపుతుంటాయి. సొంత దేశాల్లో అవినీతిమయమైన ప్రభుత్వాలు, మాదక ద్రవ్యాల ముఠాలతో నిత్యం చస్తూ బతుకుతూ హమ్మయ్య అని అమెరికా చేరుకున్నా.. కథ మొదటికి వస్తుండటం గమనార్హం. కొందరికి మాత్రం శరణార్థుల కింద అమెరికా ఆశ్రయం కల్పిస్తుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని