Deep Fake: దేశాల మధ్య డీప్‌ఫేక్‌ చిచ్చు.. ఫిలిప్పీన్స్‌-చైనాలో కలకలం సృష్టించిన వీడియో

డీప్‌ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్‌లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? 

Updated : 25 Apr 2024 11:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా డీప్‌ఫేక్ (DeepFake) కలకలం సృష్టిస్తోంది. చైనా (China)పై దాడి చేయాలంటూ స్వయంగా దేశాధ్యక్షుడే ఆదేశాలు జారీచేసినట్లున్న వీడియో క్లిప్ ఫిలిప్పీన్స్‌ (Philippines)లో సంచలనం కలిగిస్తోంది. మీడియా కథనాల ప్రకారం..

ఒక వీడియోలో ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు ఫెర్డినాండ్‌ మార్కోస్‌ జూనియర్ తన సైన్యానికి సూచనలు చేస్తున్నట్టుగా ఉంది. దేశానికి చైనా నుంచి ఏదైనా ముప్పు పొంచి ఉంటే.. తక్షణమే ప్రతిస్పందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు దానిలో కనిపిస్తోంది. దేశానికి హాని జరగడాన్ని తాను సహించలేనని..హక్కుల్ని రక్షించుకునే విషయంలో రాజీ లేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లుంది. ఒక యూట్యూబ్‌ ఛానెల్‌లో ఈ క్లిప్‌ విడుదలైంది. దానిలో దక్షిణ చైనా సముద్రంలో మోహరించిన డ్రాగన్‌ నౌకలకు చెందిన దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియో వెలుగులోకి రావడంతో ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఇది నకిలీదని ప్రజలను హెచ్చరించింది. ‘‘ఒక దేశానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు సైన్యాన్ని ఆదేశించినట్లుగా అందులో ఉంది. కానీ అలాంటి ఆదేశాలు ఏవీ జారీ కాలేదు’’ అని స్పష్టం చేసింది. అలాగే తప్పుడు సమాచార వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. దక్షిణ చైనా సముద్రం (South China Sea)లో బీజింగ్‌ దూకుడుతో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఈ వీడియో వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.

విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌.. అమెరికాలో కొత్త నిబంధనలు

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో ఈ డీప్‌ఫేక్‌లను సృష్టిస్తున్నారు. లేని వ్యక్తిని ఉన్నట్లు, అతడే స్వయంగా మాట్లాడుతున్నట్లు చేయడం ఈ టెక్నాలజీ సొంతం. కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ సాయంతో వ్యక్తుల ఫొటోలు, వీడియోలు, ఆడియోలను దీని ద్వారా రూపొందించొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే అచ్చం వేరే వ్యక్తికి డూప్‌ సృష్టించడం ఈ టెక్నాలజీతో సాధ్యమవుతోంది. డీప్‌ ఫేక్‌ టెక్నాలజీని క్రియేటివ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం రూపొందించారు. ఇటీవలకాలంలో మనదేశంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన డీప్‌ఫేక్‌ (DeepFake) ఫొటోలు, వీడియోలు సినీతారలు, సెలబ్రిటీలను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని