Canada: వియన్నా ఒప్పందాన్ని గౌరవించాలి.. కెనడాకు స్పష్టం చేసిన భారత్‌!

సరిహద్దుల్లో మయన్మార్‌వాసుల కదలికలు ఆందోళనకరమని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 16 Nov 2023 19:47 IST

దిల్లీ: దౌత్యసంబంధాలకు ఉద్దేశించిన వియన్నా ఒప్పందాన్ని (Vienna Convention) కెనడా (Canada) గౌరవించాలని భారత్‌ పునరుద్ఘాటించింది. ఇటీవల కెనడాలోని వాంకోవర్‌లో నిర్వహించిన ఓ కాన్సులర్‌ క్యాంప్‌ (Consular Camp)నకు ఆటంకం కలిగించేందుకు కొన్ని శక్తులు యత్నించాయని, అయినప్పటికీ.. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు విదేశాంగ శాఖ (MEA) తెలిపింది. ఈ క్రమంలోనే మయన్మార్‌ (Myanmar) నుంచి భారత్‌లోకి అక్రమ వలసలు, సరిహద్దు సమీపంలో హింసాత్మక ఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘భారత్ వైపు మయన్మార్ జాతీయుల కదలికలు కనిపిస్తున్నాయి. దేశ సరిహద్దుకు సమీపంలో ఇటువంటి ఘటనలు ఆందోళనకరం. మయన్మార్‌ అధికారులు స్థానికంగా చర్చలు జరిపి.. ఈ హింసాత్మక ఘటనలకు తెరదించాలి’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ సూచించారు.

ఇటీవల కెనడాలోని బ్రాంప్టన్‌లో దీపావళి పండగ రోజు చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై స్పందిస్తూ.. రెండు వర్గాల మధ్య గొడవ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నామన్నారు. ఈ విషయమై కెనడాలోని భారత కాన్సులేట్‌కు ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం కారణంగా గాజాలోని అల్‌-షిఫా ఆస్పత్రి వద్ద ఏర్పడిన దయనీయ పరిస్థితులపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. మానవతా సాయం అవసరాన్ని భారత్‌ ఇప్పటికే స్పష్టంగా చాటిచెప్పిందన్నారు. ఉగ్రదాడులను ఖండించడంతోపాటు ఉద్రిక్తతలకు తెరదించాలని పిలుపునిచ్చామన్నారు. అదే విధంగా మానవతా సాయాన్ని కూడా అందించినట్లు గుర్తుచేశారు.

అల్‌-షిఫా ఆస్పత్రి MRI యూనిట్‌లో.. హమాస్‌ ఆయుధాలు..!

వర్చువల్‌ వేదికగా శుక్రవారం నుంచి ‘వాయిస్‌ ఆఫ్‌ గ్లోబల్‌ సౌత్‌ సమ్మిట్‌ 2023’ నిర్వహించనున్నట్లు అరిందమ్‌ బాగ్చీ తెలిపారు. ప్రపంచ పరిణామాల వల్ల ఎదురవుతున్న సవాళ్లనూ ఈ సందర్భంగా చర్చిస్తామన్నారు. ఇదిలా ఉండగా.. మయన్మార్‌లో కొంతకాలంగా తరచూ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అక్కడి ప్రజలు పొరుగున ఉన్న మిజోరంలోకి అక్రమంగా ప్రవేశించి తలదాచుకుంటున్నారు. ఈ పరిణామాలపై భారత్‌ తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. మయన్మార్‌- భారత్‌ సరిహద్దు భద్రతను పర్యవేక్షిస్తున్న ‘అస్సాం రైఫిల్స్‌’ ఈ వ్యవహారంపై ఇప్పటికే అప్రమత్తమైంది. మయన్మార్‌ నుంచి వచ్చి మిజోరంలోని వివిధ జిల్లాల్లో ఆశ్రయం పొందుతున్న వారి సంఖ్య 32 వేలకు పైగా ఉండొచ్చని అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని