Katchatheevu: కచ్చతీవు వ్యవహారం.. శ్రీలంక స్పందన ఏంటంటే!

కచ్చతీవు దీవి వ్యవహారంపై శ్రీలంక స్పందించింది. ఈ విషయం తమవద్ద చర్చకే రాలేదని మంత్రి బందుల గుణవర్ధెన మీడియాకు వెల్లడించారు.

Published : 02 Apr 2024 16:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ భారత్‌లో కచ్చతీవు (Katchatheevu) ద్వీపం వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఐదు దశాబ్దాల క్రితం కాంగ్రెస్‌ పార్టీ పూర్తి నిర్లక్ష్యంగా ఈ దీవిని శ్రీలంక (Sri Lanka)కు ఇచ్చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై శ్రీలంక స్పందించింది. ఈ వ్యవహారం తమవద్ద చర్చకే రాలేదని సమాచారశాఖ మంత్రి బందుల గుణవర్ధెన మీడియాకు వెల్లడించారు. ‘‘కచ్చతీవు సమస్యను శ్రీలంక మంత్రివర్గం ఇప్పటివరకు చర్చించలేదు. అసలు ఈ అంశాన్ని ఎవరూ లేవనెత్తలేదు’’ అని చెప్పడం గమనార్హం.

కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?

భారత్‌- శ్రీలంక మధ్య ఉన్న చిరుద్వీపమే కచ్చతీవు. ఇది తమిళనాడులోని రామేశ్వరానికి 19 కిలోమీటర్లు, శ్రీలంకలోని జాఫ్నాకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1974-76 మధ్య భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక అధ్యక్షురాలు సిరిమావో బండారునాయకెల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా ఈ దీవిపై న్యూదిల్లీ హక్కులను వదులుకొంది. దీనిపై ఓ కథనాన్ని ఉటంకించిన ప్రధాని మోదీ.. దేశ సమగ్రత, ప్రయోజనాలను బలహీనపర్చేలా కాంగ్రెస్‌ 75 ఏళ్లు పనిచేసిందని విమర్శించారు. నాటి ప్రధానులు భారత భూభాగంపై ఉదాసీనత ప్రదర్శించారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ స్పందించారు.

అవాస్తవాలతో వివాదానికి ఆస్కారం: చిదంబరం

కచ్చతీవుపై 50 ఏళ్ల తర్వాత అవాస్తవమైన, ఘర్షణపూరిత ప్రకటనలు.. శ్రీలంక ప్రభుత్వానికి, అక్కడున్న 35 లక్షల మంది తమిళులకు మధ్య వివాదానికి కారణమయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం హెచ్చరించారు. ‘‘ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతీసేలా జైశంకర్‌ తదితరులు మాట్లాడే ముందు.. ఆ దేశంలో 35 లక్షల మంది శ్రీలంక, భారతీయ తమిళులు నివసిస్తున్నారన్న విషయం గుర్తుంచుకోవాలి. కేంద్రం తన దూకుడు ధోరణిని చైనాపై ప్రదర్శించాలి. రెండువేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది. ప్రాంతాల పేర్లు మారుస్తున్న డ్రాగన్‌ చర్యలపై విదేశాంగ మంత్రి ఎందుకు స్పందించరు?’’ అని ‘ఎక్స్‌’ వేదికగా ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని