Katchatheevu: కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?

భారత్‌కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్‌ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది.

Updated : 01 Apr 2024 13:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: భారత్‌కు చెందిన కచ్చతీవు (Katchatheevu) దీవిని  కేంద్రంలోని కాంగ్రెస్‌ సర్కార్ 1974లో శ్రీలంక (Sri Lanka)కు అప్పగించింది. దీనిపై తాజాగా తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో మళ్లీ వార్తల్లోకి వచ్చింది.

ఎక్కడుంది ఈ దీవి?

తమిళనాడు రామేశ్వరం దీవికి సమీపంలో భారత్‌- శ్రీలంకను వేరుచేస్తున్న పాక్‌ జలసంధిలో ఉంది. ఈ జలసంధి రెండుదేశాలకు సరిహద్దుగా ఉంటోంది. పాక్‌ బే, బంగాళాఖాతంతో ఈ జలసంధి కలుపుతోంది. 1974లో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారునాయకేల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు అప్పగించారు. ఇది చాలా చిన్నదీవి. ఎవరూ ఉండరు. అయితే దీనిపరిధిలో మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. దీంతో భారత మత్స్యకారులు ఇక్కడ వేట ఎక్కువగా సాగిస్తుంటారు. శ్రీలంక తమది అన్న నెపంతో వీరిపై దాడులు చేయడంతో పాటు అరెస్టులు చేస్తోంది. ఈ దీవిలో భారత్‌ మత్స్యకారులకు ప్రవేశం ఉందని ఒప్పందం స్పష్టం చేస్తున్నా.. శ్రీలంక ఖాతరు చేయడం లేదు. ఇక్కడ సెయింట్‌ ఆంటోనీ అనే ప్రార్థనామందిరం ఉంది. ఏటా జరిగే ఉత్సవాల్లో తమిళనాడు వాసులు ఎక్కువగా పాల్గొంటారు.

మన భూభాగాలను ఇతరులకు ఇవ్వొచ్చా?

భారత రాజ్యాంగ ప్రకారం మన భూభాగాన్ని ఇతర దేశాలకు ఇవ్వాలంటే కచ్చితంగా రాజ్యాంగ సవరణ తప్పనిసరి. 1958లో భారత్‌-తూర్పు పాకిస్థాన్‌ల మధ్య బెరుబరి ప్రాంతం వివాదంగా ఉండేది. భారత ప్రధాని నెహ్రూ, తూర్పు పాకిస్థాన్‌ గవర్నర్‌ ఫిరోజ్‌ఖాన్‌ నూన్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం బెరుబరిలోని కొంత ప్రాంతాన్ని తూర్పు పాకిస్థాన్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్) ఇచ్చారు. అయితే దీనిపై వివాదం చెలరేగడంతో అంశం సుప్రీం కోర్టుకు చేరింది. మన దేశానికి చెందిన ప్రాంతాలను ఇతర దేశాలకు ఇవ్వడం చెల్లదని పేర్కొంది. దీంతో 1960లో రాజ్యాంగ సవరణ చేసి కొంతప్రాంతాన్ని తూర్పు పాక్‌కు ఇచ్చారు.  

కచ్చతీవు అప్పగింత చెల్లుతుందా?

కచ్చతీవు స్వాతంత్ర్యం రాకపూర్వం రామ్‌నాడ్‌ పాలకుల ఆధీనంలో ఉండేది. ప్రస్తుతం రామేశ్వరం సహా పలుదీవులపై రామ్‌నాడ్‌ జమీందారుల పాలన సాగేది. అనంతరం భారత్‌లో చేరడం, తమిళనాడు రాష్ట్రం ఏర్పాటు జరిగింది. న్యాయపరంగా చూస్తే ఈ అప్పగింత చెల్లదని తమిళనాడు పక్షాలు వాదిస్తున్నాయి. రాజ్యాంగ సవరణ చేయకుండా ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నాయి.

కాంగ్రెస్‌ నిర్లక్ష్యంతోనే కచ్చతీవు దీవిని వదిలేసింది: ప్రధాని మోదీ

1974 తరువాత తమిళనాడులో ప్రతీ ఎన్నికల్లో ఇదే కీలకాంశంగా మారుతోంది. ఎన్నికల అనంతరం మరుగునపడుతోంది. తమిళ జాలర్లపై శ్రీలంక దళాలు కచ్చతీవు ప్రాంతంలోనే దాడులకు దిగుతుండటం గమనార్హం. లక్షల విలువైన పడవలను ధ్వంసం చేయడం, మత్స్యకారులను బందీలుగా పట్టుకోవడం లాంటి దుందుడుకు చర్యలకు కొలంబో దళాలు పాల్పడుతున్నాయి. వీటిని నివారించేందుకు కేంద్రం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని తమిళ రాజకీయపక్షాలు కోరుతున్నాయి. అయితే వివాదానికి కేంద్ర బిందువు కచ్చతీవు కాబట్టి.. ఆ దీవిని భారత్‌ తిరిగి స్వాధీనం చేసుకుంటే తమిళ జాలర్లకు ప్రాణాలకు రక్షణ ఉంటుందని జాలర్ల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని