DNA: 40 ఏళ్ల కిందటి కేసు.. ‘చూయింగ్‌ గమ్‌’తో దొరికిపోయి!

నాలుగు దశాబ్దాల కిందటి ఓ హత్య కేసుకు సంబంధించి చూయింగ్‌ గమ్‌లోని డీఎన్‌ఏ ఆనవాళ్లు నిందితుడిని పట్టించాయి.

Published : 25 Mar 2024 00:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాలుగు దశాబ్దాల కిందటి ఓ హత్య కేసులో మిస్టరీ ఎట్టకేలకు వీడింది. చూయింగ్‌ గమ్‌లోని డీఎన్‌ఏ ఆనవాళ్లు నిందితుడిని పట్టించడం గమనార్హం. దీంతో ఈ కేసులో నిందితుడిగా ఉన్న 60 ఏళ్ల వృద్ధుడు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

ఓరెగాన్‌లోని మౌంట్‌ హూడీ కమ్యూనిటీ కాలేజీలో బార్బారా టక్కర్‌ (19) విద్యార్థిని. జనవరి 15, 1980న ఆమె అపహరణకు గురయ్యారు. మరుసటి రోజు కాలేజీకి వచ్చిన విద్యార్థులు.. క్యాంపస్‌ పార్కింగ్‌ సమీపంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తు జరిపిన పోలీసులు.. లైంగిక దాడి అనంతరం అత్యంత దారుణంగా హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. రాబర్ట్‌ ప్లింప్టన్‌ ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానించిన దర్యాప్తు అధికారులు అతడిపై పలు అభియోగాలు మోపారు. అయితే, సరైన ఆధారాలు లభించకపోవడంతో కేసు మరుగున పడిపోయింది.

మాస్కోలో మారణహోమం.. పుతిన్‌ హెచ్చరిక!

2000లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాధితురాలి శవపరీక్ష నాటి నమూనాలను ఒరెగాన్‌ స్టేట్‌ పోలీస్‌ (OSP) క్రైమ్‌ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ వారు విశ్లేషించి.. డీఎన్‌ఏ ప్రొఫైల్‌ను రూపొందించారు. అనంతరం రాబర్ట్‌పైనా నిఘా కొనసాగించారు. ఈ క్రమంలో ఓసారి అతడు (2021లో) చూయింగ్‌ గమ్‌ నమలడాన్ని చూసిన పోలీసులు.. దాన్ని సేకరించి ఓఎస్‌పీ ల్యాబ్‌కు పంపించారు. అది 2000లో రూపొందించిన డీఎన్‌ఏ ప్రొఫైల్‌తో సరిపోలినట్లు గుర్తించారు.

జూన్‌ 8, 2021లో ప్లింప్టన్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. డిటెన్షన్‌ సెంటర్లో నిర్బంధించారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. అతడిని దోషిగా తేల్చింది. అతడు మాత్రం తాను నేరం చేయలేదని వాదించాడు. ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లనున్నట్లు అతడి తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. దీంతో తుది తీర్పు జూన్‌లో వెలువడే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని