Health: మొటిమల క్రీం వాడే ముందు.. ఈ జాగ్రత్త తప్పనిసరి!

మొటిమల చికిత్సలో వాడే క్రీమ్‌ను రిఫ్రిజిరేటర్‌ ఉష్ణోగ్రతలో ఉంచడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల వీటిపై విభిన్నమైన కథనాలు రావడంతో ఈ విషయాన్ని వెల్లడించారు.  

Updated : 21 Mar 2024 10:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీనేజ్‌, యువతలో సర్వసాధారణంగా మొటిమల సమస్యను చూస్తూనే ఉంటాము. వాటిని ఎదుర్కోవడానికి రకరకాల క్రీమ్‌లు వినియోగిస్తుంటారు. వీటిల్లో ముఖ్యంగా బెంజయిల్‌ పెరాక్సైడ్‌ మిశ్రమాలను వాడుతుంటారు. వీటి వినియోగంలో చిన్న జాగ్రత్తలు తీసుకొంటే క్యాన్సర్‌ ముప్పును తప్పించుకోవచ్చని ది అమెరికన్‌ యాక్నే అండ్‌  రొసేసియా సొసైటీ (ఏఏఆర్‌ఎస్‌) పేర్కొంది. ‘‘మొటిమలు, ఇతర చర్మ సమస్యలతో బాధపడే చాలా మంది పేషెంట్లకు చికిత్సలో బెంజయిల్‌ పెరాక్సైడ్‌ కీలకం’’ అని వివరించింది. ఈ సొసైటీలో మొత్తం 6,000 మంది సభ్యులున్నారు. బెంజయిల్‌ పెరాక్సైడ్‌ మిశ్రమంతో ఉన్న క్రీములు, జెల్స్‌, వాష్‌లను ఫ్రిజ్‌లలో ఉంచాలని సూచించింది. అప్పుడు శరీరం బెంజీన్‌ బారినపడే అవకాశం తగ్గుతుందని వెల్లడించింది. 

బెంజయిల్‌ పెరాక్సైడ్‌ అధికమోతాదులో ఉండటంతో మొటిమల చికిత్స క్రీమ్‌లు ఇతర ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని ప్రముఖ ల్యాబ్‌ వాలీష్యూర్‌ అమెరికా ఎఫ్‌డీఏ వద్ద పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్‌ కథనంలో వెల్లడించింది. చాలా ప్రముఖ కంపెనీల క్రీముల్లో బెంజీన్‌ అధికంగా ఉన్నట్లు తాము గుర్తించామని వాలీష్యూర్‌ వెల్లడించింది. 

పెద్ద మొటిమలు!

ఈ ఫలితాలు నిర్ఘాంతపరిచినట్టు ఏఏఆర్‌ఎస్‌ అధ్యక్షుడు జేమ్స్‌ డెల్‌ రోస్సో పేర్కొన్నారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా బెంజయిల్‌ పెరాక్సైడ్‌ను చికిత్సల్లో వాడుతున్నామని పేర్కొన్నారు. మరోవైపు ఎఫ్‌డీఏ కూడా దీనిపై స్పందిస్తూ.. వాలీష్యూర్‌ సంస్థ ఫలితాలను మరింత లోతుగా విశ్లేషిస్తామని వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని