పెద్ద మొటిమలు!

యుక్తవయసులో, యవ్వనంలో మొటిమలు మామూలే. ఒక వయసు వచ్చేసరికివి చాలావరకూ తగ్గిపోతాయి కూడా. అంతటితో మొటిమల కథ ముగిసినట్టేనని సంతోషిస్తుంటారు.

Published : 19 Mar 2024 01:05 IST

యుక్తవయసులో, యవ్వనంలో మొటిమలు మామూలే. ఒక వయసు వచ్చేసరికివి చాలావరకూ తగ్గిపోతాయి కూడా. అంతటితో మొటిమల కథ ముగిసినట్టేనని సంతోషిస్తుంటారు. కానీ కొందరిలో 30ల్లో, 40ల్లో.. ఆ తర్వాతా రావొచ్చు. యవ్వనంలో మొటిమలు ఉద్ధృతంగా మొలవకపోయినా పెద్దయ్యాక వచ్చే అవకాశమూ ఉంది. మంచి విషయం ఏంటంటే- చికిత్సలతో తగ్గటం.

ఏ వయసులోనైనా మొటిమలకు మూలం ఒకటే. చర్మ రంధ్రాలు నూనె, మృతకణాలు, దుమ్ముతో పూడుకోవటం. అయితే యవ్వనంలో మాదిరిగా కాకుండా పెద్దవయసులో మొటిమలకు ఇతరత్రా అంశాలు కారణమవుతూ వస్తుంటాయి.

 హార్మోన్లు: యుక్తవయసులో మొటిమలకు ప్రధాన కారణం హార్మోన్ల మార్పులే. కానీ పెద్దయ్యాక సహజంగా తలెత్తే హార్మోన్లు హెచ్చతగ్గులూ మొటిమలకు దారితీయొచ్చు. హార్మోన్ల హెచ్చుతగ్గుల మూలంగా చర్మం మరింత ఎక్కువగా నూనెను ఉత్పత్తి చేస్తుంది. ఇది చర్మం రంధ్రాల్లో పేరుకుపోయి, బ్యాక్టీరియాతో కలిసి మొటిమలు మొలవచ్చు. ఇలాంటివి మహిళల్లో జీవితాంతం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా నెలసరికి ముందూ వెనకా, గర్భధారణ సమయంలో, గర్భనిరోధక మాత్రలు ఆరంభించినప్పుడు, మానేసినప్పుడు కనిపిస్తుంటాయి. టెస్టోస్టిరాన్‌ మోతాదులు ఎక్కువగా గల మగవారిలోనూ ఇవి తలెత్తుతుంటాయి.

 మందులు: కొన్నిరకాల మందుల దుష్ప్రభావంతోనూ మొటిమలు రావొచ్చు. మానసిక చికిత్సలో వాడే లిథియం వంటి మందులు, ప్రెడ్నిసోన్‌ లాంటి కార్టికోస్టిరాయిడ్లు వీటికి కారణం కావొచ్చు. టెస్టోస్టిరాన్‌ చికిత్స, గర్భనిరోధక మాత్రలు, వే ప్రోటీన్‌ కూడా మొటిమలను తెచ్చిపెట్టొచ్చు.
జన్యువులు: సహజంగా జిడ్డు చర్మం కలిగుండటం, చర్మకణాల మార్పిడి ఆలస్యంగా జరగటం వంటి సమస్యలు గలవారిలో కొన్నిసార్లు మొటిమలు జీవితాంతం వేధిస్తూ ఉండొచ్చు. ఇవి వయసు, హార్మోన్ల మార్పులతో పాటు ఉద్ధృతమవుతుంటాయి. పెద్ద వయసులో మొటిమలతో బాధపడే కుటుంబ సభ్యులు గలవారికీ వచ్చే అవకాశముంది.
మానసిక ఒత్తిడి: దీంతో కార్టిజోల్‌ హార్మోన్‌ మోతాదులు పెరుగుతాయి. ఫలితంగా నూనె ఉత్పత్తి పెరిగి, మొటిమలు ఉద్ధృతమయ్యే అవకాశముంది. ఇవి చాలావరకూ ఒత్తిడి తగ్గగానే నయమవుతాయి. నిద్ర, ఆహార అలవాట్ల మీదా ఒత్తిడి ప్రభావం చూపుతుంది. ఇదీ మొటిమలకు దోహదం చేయొచ్చు.

చికిత్సలతో మేలు

పెద్దవయసు మొటిమలకు బ్యాక్టీరియాను చంపే, జిడ్డును తొలగించే జెల్‌తో ముఖాన్ని కడుక్కోవటం బాగా ఉపయోగపడుతుంది. అయితే వయసు మీద పడుతున్నకొద్దీ చర్మం పొడిబారటం, కొలాజెన్‌ తగ్గటం వల్ల వీటితో చర్మం మరింత ఎక్కువగా పొడిబారే అవకాశముంది. కాబట్టి జాగ్రత్త అవసరం. మొటిమలు తగ్గటానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుందని గుర్తించాలి. మొటిమలు వచ్చేవారు చర్మ సౌందర్యం కోసం నూనె లేని మాయిశ్చరైజర్లు, సన్‌స్క్రీన్లు, క్లెన్సర్లు వాడుకోవాలి. అయితే మొటిమలు అతిగా వేధిస్తున్నా, మచ్చలు ఏర్పడుతున్నా డాక్టర్‌ను సంప్రదించటం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని