Rishi Sunak: ‘ఎలాన్‌ మస్క్‌ అయితే ఏంటీ.. అది తప్పే’: రిషి సునాక్‌ కీలక వ్యాఖ్యలు

‘యూదు వ్యతిరేకత’ ఏ రూపంలో ఉన్నా సరే.. దాన్ని తాను తీవ్రంగా ఖండిస్తానని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) అన్నారు. ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) అయినా సరే.. అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పేనన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Published : 27 Nov 2023 11:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్-హమాస్‌ (Israel-Hamas) యుద్ధం వేళ ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ‘ఎక్స్‌ (X)’ వేదికగా యూదు వ్యతిరేక పోస్టులు రావడం, వాటిల్లో కొన్నింటికి ఆ సంస్థ యజమాని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) మద్దతు పలకడం ఇటీవల తీవ్ర దుమారం రేపింది. మస్క్‌ తీరును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా పలువురు టెక్‌ దిగ్గజాలు కూడా తప్పుబట్టారు. తాజాగా యూకే ప్రధాన మంత్రి రిషి సునాక్‌ (UK PM Rishi Sunak) కూడా దీనిపై స్పందించారు.

‘‘నేను చాలా మందితో చర్చలు జరుపుతాను. అయితే వారి వ్యక్తిగత అభిప్రాయాలపై నేను దృష్టి సారించాలనుకోవడం లేదు. వాస్తవానికి నేను యూదు వ్యతిరేకతను అసహ్యించుకుంటాను. అది ఎలాన్‌ మస్క్‌ అయినా సరే.. వీధుల్లో ఉండే వ్యక్తి అయినా సరే.. ఇతరులను దుర్భాషలాడటం తప్పే. యూదు వ్యతిరేకత ఏ రూపంలో ఉన్నా సరే అది పూర్తిగా తప్పు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను’’ అని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషి సునాక్ వెల్లడించారు.

‘ఆ పసి హృదయం దారుణంగా గాయపడింది’: బైడెన్‌

నవంబరు ఆరంభంలో యూకేలో జరిగిన ఏఐ సేఫ్టీ సమ్మిట్‌లో భాగంగా ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌తో రిషి సునాక్‌ భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు మస్క్‌ను సునాక్‌ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు యూదు వ్యతిరేకతను ప్రోత్సహించేలా మస్క్‌ పోస్ట్ చేయడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే గతవారం యూకే పార్లమెంట్‌లో దీనిపై చర్చ జరిగింది. మస్క్‌ పోస్ట్‌ను ప్రధాని సునాక్‌ ఖండించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. కానీ, ప్రధాని అందుకు నిరాకరించారు. దీంతో సునాక్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా టీవీ ఇంటర్వ్యూలో మస్క్‌ పోస్ట్‌ను సునాక్‌ ఖండించడం గమనార్హం.

ఎక్స్‌ వేదికగా యూదు వ్యతిరేక యూజర్లతో ఇటీవల మస్క్‌ విరివిగా సంభాషణలు జరిపారు. ఈ క్రమంలోనే యూదులు, శ్వేతజాతీయులను కించపర్చేలా ఓ యూజర్‌ పెట్టిన పోస్ట్‌కు మస్క్‌ స్పందిస్తూ.. ‘సరిగ్గా చెప్పారు’ అని అనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే మస్క్‌ తీరుపై మండిపడిన యాపిల్‌, డిస్నీ వంటి కొన్ని దిగ్గజ సంస్థలు.. ‘ఎక్స్‌’లో తమ యాడ్స్‌ను నిలిపివేశాయి. ఈ వివాదం కొనసాగుతున్న వేళ.. మస్క్‌ సోమవారం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో సమావేశం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు