‘ఆ పసి హృదయం దారుణంగా గాయపడింది’: బైడెన్‌

Israel-Hamas Conflict: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన సంధి నేటితో ముగియనుంది. దీనిని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

Updated : 27 Nov 2023 11:27 IST

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌-హమాస్(Israel-Hamas) మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో గత మూడు రోజులు రెండువర్గాలు తమ చెరలో ఉన్న బందీలను విడుదల చేశాయి. నేటి(సోమవారం)తో నాలుగు రోజుల సంధి గడువు ముగియనుంది. ఈ క్రమంలో ఈ ఒప్పందం పొడిగింపునకు అనుకూలంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలు చేశారు. దానివల్ల మరింతమంది బందీలు విడుదలయ్యే వీలు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. (Israel-Hamas Conflict)

అమెరికా, ఖతార్‌ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందంతో హమాస్‌ 58 మందిని విడిచిపెట్టగా.. ఇజ్రాయెల్‌ 114 మందికి విముక్తి కల్పించింది. వీరిలో నాలుగేళ్ల అమెరికా బాలిక కూడా ఉంది. ‘ఈ డీల్ ఎన్నో ప్రాణాలను కాపాడుతోంది. గాజాకు అత్యంత అవసరమైన మానవతా సాయం అందుతోంది. ఈ ఫలితాలను ఇలాగే పొందేందుకు దీనిని పొడిగించవచ్చు. అదే నా లక్ష్యం. మనందరి లక్ష్యం అదే’ అని బైడెన్ అన్నారు. అలాగే ఆ పసి హృదయం దారుణంగా గాయపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ ఏడున హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడిలో ఆ బాలిక తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు.

అమెరికా యుద్ధనౌకను తరిమికొట్టాం

మరోపక్క హమాస్ కూడా ఈ ఒప్పందం పొడిగింపును కోరుకుంటోంది. బందీల విడుదల కోసం ఇజ్రాయెల్‌ సీరియస్‌గా ఉంటే.. ఈ డీల్‌ను పొడిగించొచ్చని హమాస్ తన ప్రకటనలో పేర్కొంది.

నెతన్యాహుతో భేటీ కానున్న మస్క్‌..!

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌ అధ్యక్షుడితోనూ సమావేశం కానున్నారు. ఇజ్రాయెల్‌ వర్గాలు ఈ భేటీని ధ్రువీకరించగా.. మస్క్‌ ప్రతినిధుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. తన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌(ట్విటర్‌)లో యూదు వ్యతిరేక విద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ మస్క్‌పై పౌర సంఘాలు ఆరోపణలు చేశాయి. ఈ క్రమంలోనే ఈ భేటీ వార్తలు రావడం గమనార్హం. 

గాజా కరవు అంచున ఉంది: ఐరాస

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య ఘర్షణతో గాజా నగర ప్రజల జీవితాలు ఛిద్రమవుతున్నాయి. ఈ దాడులతో గాజా నగరం కరవు అంచున కొట్టుమిట్టాడుతోందని ఐరాస అనుబంధ సంస్థ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం హెచ్చరించింది. ఆ నగరానికి మానవతా సాయాన్ని మరింత పెంచాలని ప్రపంచ దేశాలను కోరింది. ఈ కరవు వల్ల వ్యాధులు వ్యాప్తి చెందొచ్చని, ఇతర విపత్కర పరిస్థితులు ఎదురుకావొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే నాలుగు రోజుల కాల్పులు విరమణతో గాజాకు అందుతోన్న సాయం కాస్త పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని