US Tariffs: చైనాకు ఊరట

Eenadu icon
By International News Desk Published : 31 Oct 2025 05:11 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

సుంకాల తగ్గింపునకు ట్రంప్‌ అంగీకారం
జిన్‌పింగ్‌తో భేటీ తర్వాత నిర్ణయం

బుసాన్‌లో గురువారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల కరచాలనం

బుసాన్‌: అమెరికా, చైనా అధినేతలు డొనాల్డ్‌ ట్రంప్, షీ జిన్‌పింగ్‌ల భేటీ సత్ఫలితాలిచ్చింది. దక్షిణ కొరియాలోని బుసాన్‌లో గురువారం వారి మధ్య జరిగిన సమావేశంలో సుంకాలపై సయోధ్య కుదిరింది. దీంతో చైనాపై సుంకాలను తగ్గిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఎపెక్‌ సీఈవో సదస్సు ముగించుకుని అమెరికాకు తిరిగి వెళ్తూ.. ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిన్‌పింగ్‌తో ట్రంప్‌ గంటా 40 నిమిషాలపాటు సమావేశమయ్యారు. ఎపెక్‌ సదస్సు జరిగిన గ్యాంగ్జుకు 47 మైళ్ల దూరంలోని బుసాన్‌లో ఈ భేటీ జరిగింది. అనంతరం దీనిని జీ-2 సమావేశంగా ట్రంప్‌ అభివర్ణించారు.

‘జిన్‌పింగ్‌తో సమావేశం విజయవంతమైంది. 1 నుంచి 10 రేటింగ్‌ ప్రకారం చూస్తే.. 10 అంటే అద్భుతమని చెబుతారు. మా సమావేశం 12 అని చెప్పవచ్చు. అంటే అత్యద్భుతమని అనుకుంటున్నా. చైనాపై సుంకాలను తగ్గిస్తా. అలాగే అరుదైన ఖనిజాల ఎగుమతులను చైనా కొనసాగించేందుకు అంగీకరించింది. అమెరికన్‌ సోయాబీన్లను కొనడానికీ సంసిద్ధత వ్యక్తం చేసింది’ అని ట్రంప్‌ వెల్లడించారు. 

  • వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తాను చైనా పర్యటనకు వెళ్తానని ట్రంప్‌ తెలిపారు. ఆ తరువాత జిన్‌పింగ్‌ అమెరికాలో పర్యటిస్తారని వెల్లడించారు. 
  • ఫెంటానిల్‌లో ఉపయోగించే రసాయనాలను అమెరికాకు ఎగుమతి చేస్తున్నందుకు ప్రతిగా విధించిన 20 శాతం సుంకాల్లో 10 శాతం తగ్గిస్తానని ట్రంప్‌ తెలిపారు. దీంతో చైనాపై సుంకాలు 57 శాతం నుంచి 47 శాతానికి తగ్గుతాయి. 
  • అత్యాధునిక కంప్యూటర్‌ చిప్‌లను చైనాకు ఎగుమతి చేయడంపై చర్చించామని ట్రంప్‌ తెలిపారు. త్వరలోనే ఆ దేశంతో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేస్తానని వెల్లడించారు.

ప్రధానాంశాలపై తొలగని ఉద్రిక్తత

ట్రంప్, జిన్‌పింగ్‌ల భేటీలో సుంకాలు, ఎగుమతులపై సయోధ్య కుదిరినా ప్రధానాంశాలపై రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతలు అలాగే ఉన్నాయి. తయారీ రంగం, ఏఐవంటి ఆధునిక సాంకేతికతలపై ఆధిపత్య పోరు కొనసాగనుంది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలోనూ సందిగ్ధత అలాగే ఉంది.

టిక్‌టాక్‌ విషయంలో భేటీలో చర్చకు రాలేదని, చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుంటామని చైనా వాణిజ్యశాఖ వెల్లడించింది. 


రష్యా నుంచి చమురును భారత్‌ తగ్గిస్తోంది: ట్రంప్‌

న్యూయార్క్‌: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును తగ్గించే విషయంలో భారత్‌ బహుబాగని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. క్రమంగా దేశం చమురు దిగుమతులను తగ్గిస్తుందని తెలిపారు. ‘రష్యా నుంచి చమురును చాలాకాలంగా చైనా కొనుగోలు చేస్తోంది. ఆ దేశ అవసరాల్లో ఎక్కువ దీనిద్వారానే సాధ్యమవుతుంది. ఈ విషయంలో భారత్‌ బహుబాగు. అయితే జిన్‌పింగ్‌తో చమురు గురించి చర్చించలేదు. యుద్ధం ముగింపు గురించి మాట్లాడుకున్నాం’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు