Dubai Airport: అతిపెద్ద ఎయిర్‌పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!

అల్‌ మక్తూమ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో 35 బిలియన్‌ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్‌ నిర్మించనున్నారు.

Published : 29 Apr 2024 00:12 IST

దుబాయ్‌: ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్‌ (Dubai) అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అభివృద్ధి దశలో ఉన్న ‘దుబాయ్‌ వరల్డ్‌ సెంట్రల్‌’లోని అల్‌ మక్తూమ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో 35 బిలియన్‌ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్‌ నిర్మించనున్నారు. వచ్చే పదేళ్లలో కార్యకలాపాలన్నీ అక్కడ నుంచే సాగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు దుబాయ్‌ పాలకుడు ప్రకటించారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా నిలువనుంది.

కొత్తగా నిర్మించనున్న టెర్మినల్‌ను అల్‌ మక్తూమ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు (Al Maktoum International Airport)గా పిలుస్తారు. దుబాయ్‌లో త్వరలో ప్రపంచ ఎయిర్‌పోర్టు, పోర్టు, అర్బన్‌ హబ్‌, న్యూ గ్లోబల్‌ సెంటర్‌ అందుబాటులోకి రానున్నాయని దుబాయ్‌ పాలకుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ పేర్కొన్నారు. తదుపరి కార్యకలాపాలు అక్కడనుంచే సాగుతాయని, భవిష్యత్తు తరాల కోసం ఈ కొత్త ప్రాజెక్టును చేపడుతున్నామని షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ వీడియో ప్రకటనలో పేర్కొన్నారు.

  • ఏడాదికి 26కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ఈ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నారు
  • ప్రస్తుతం ఉన్న ఎయిర్‌పోర్టు విస్తీర్ణంతో పోలిస్తే ఐదు రెట్లు పెద్దది. ఇప్పుడు కేవలం రెండు రన్‌వేలు మాత్రమే ఉన్నాయి.
  • 400 ఎయిర్‌క్రాఫ్ట్‌ గేట్లు, ఐదు సమాంతర రన్‌వేలు ఉంటాయి. సరికొత్త టెక్నాలజీలను వినియోగించనున్నారు.
  • దక్షిణ దుబాయ్‌లో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న ఈ ఎయిర్‌పోర్టు చుట్టూ నగరం నిర్మాణం కాబోతోంది. లక్షల మంది నివాసం ఉండే అవకాశం ఉండడంతో, హౌసింగ్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడనుంది.
  • లాజిస్టిక్‌, ఎయిర్‌పోర్టు రంగంలో అతిపెద్ద కంపెనీలకు ఇది కేంద్రంగా మారనుంది. కొత్తగా నిర్మించనున్న ఈ టెర్మినల్‌ ఖరీదు రూ.2.9లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని