Earthquake: ఇరాన్‌లో భూకంపం.. అణు పరీక్షలే కారణమా?

Eenadu icon
By International News Team Published : 21 Jun 2025 15:48 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌ (Israel) దాడులతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ఇరాన్‌లో భూకంపం సంభవించింది. సెమ్నాన్‌ ప్రాంతంలో 5.2 తీవ్రతతో ఇది చోటుచేసుకోగా.. 10కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అయితే, టెల్‌ అవీవ్‌తో ఉద్రిక్తతల వేళ టెహ్రాన్‌ రహస్యంగా అణు పరీక్షలు నిర్వహించి ఉండవచ్చని, భూకంపానికి ఇది కారణం కావచ్చనే అనుమానాలు మొదలయ్యాయి. అంతరిక్ష, క్షిపణి కాంప్లెక్స్‌ ఉన్న నగరానికి సమీపంలోనే భూకంపం సంభవించడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది.

ఇరాన్‌లోని సెమ్నాన్‌ ప్రావిన్సులోనే అంతరిక్ష కేంద్రం, మిస్సైల్‌ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. అక్కడి రక్షణశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటికి సమీపంలోనే తాజాగా భూకంపం చోటుచేసుకుంది. బలమైన ప్రకంపనలు ఉత్తర ఇరాన్‌లో అనేక ప్రాంతాలను తాకినట్లు సమాచారం. అయితే, దీని కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, నష్ట తీవ్రత తక్కువగానే ఉందని ఇరాన్‌ న్యూస్‌ ఏజెన్సీ ఏఆర్‌ఎన్‌ఏ వెల్లడించింది. 

ప్రపంచంలో భూకంప ముప్పు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇరాన్‌ కూడా ఒకటి.  అరేబియన్‌, యురేషియన్‌ టెక్టోనిక్‌ ప్లేట్లు కలిసే ఆల్పైన్‌-హిమాలయన్‌ సెస్మిక్‌ బెల్టు వెంబడి ఉండటమే ఇందుకు కారణం. ఏడాదికి దాదాపు 2వేలకుపైగా భూకంపాలు నమోదవుతుంటాయి. వీటిలో 5 కంటే ఎక్కువ తీవ్రతతో వచ్చేవి 15 నుంచి 16 వరకు ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా 2006-15 మధ్యకాలంగా ఇక్కడ 96వేల భూకంపాలు సంభవించినట్లు అంచనా.

అణ్వాయుధ కార్యక్రమాలు చేపట్టే సమయంలో భూగర్భ పేలుళ్లు తీవ్ర ప్రకంపనలకు కారణమవుతుంటాయి. పేలుడు సంభవించే ప్రాంతంలో టెక్టోనిక్‌ ప్లేట్లపై ఒత్తిడి పెరగడం ఇందుకు కారణంగా నిపుణులు చెబుతుంటారు. అయితే, పేలుడు వల్ల ఇవి సంభవించాయా? లేక సాధారణ ప్రకంపనలా అనే విషయాన్ని తరంగాలను అధ్యయనం చేయడం ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు. తాజాగా వచ్చిన అణు పరీక్షల వాదనను భూకంప శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు. పది కిలోమీటర్ల లోతులో అణుపరీక్షలు నిర్వహించరని, భౌగోళికంగా అది అసాధ్యమని కొందరు నిపుణులు చెప్పినట్లు ఇరాన్‌ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు