Earthquake: 8.8 తీవ్రతతో భూకంపం.. జపాన్‌, రష్యాలను తాకిన సునామీ

Eenadu icon
By International News Team Updated : 30 Jul 2025 10:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా తీరంలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 8.8గా నమోదైంది. జపాన్‌ వాతావరణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈక్రమంలోనే రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్‌కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలు చేసిన కొద్దిసేపటికే రష్యా, జపాన్‌లను సునామీ తాకింది.

జపాన్‌లోని నాలుగు పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న హక్వైడో నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియలేదు. భూప్రకంపనల నేపథ్యంలో పెట్రోపావ్లోవ్స్క్‌-కామ్చాట్‌స్కీ నగరంలోని భవనాలు కంపించాయని రష్యా మీడియా తెలిపింది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లు పేర్కొంది. కామ్చాట్‌స్కీ ప్రాంతంలో విద్యుత్‌, సెల్‌ఫోన్‌ సేవల్లో అంతరాయాలు ఏర్పడినట్లు వివరించింది. అత్యవసర సేవల కోసం ఒక టాస్క్‌ఫోర్స్‌ టీంను ఏర్పాటుచేసినట్లు జపాన్‌ ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రకంపనలకు సంబంధించిన తీవ్రతను తెలిపే వీడియోలు తాజాగా బయటకు వచ్చాయి. ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్లీ ఇప్పుడే. 

రష్యాలోని కురిల్‌ దీవులు, జపాన్‌లోని ఉత్తర ద్వీపమైన హక్వైడో తీర ప్రాంతాలను సునామీ తాకింది. హోనోలులులో సునామీ హెచ్చరిక సైరన్లు మోగాయి. భయాందోళనకు గురైన ప్రజలు నివాస ప్రాంతాలను వీడుతున్నారు. స్థానిక గవర్నర్ వాలెరీ లిమారెంకో ప్రకారం.. సునామీ మొదట రష్యాలోని కురిల్‌ దీవులలోని ప్రధాన స్థావరమైన సెవెరో-కురిల్స్క్‌ తీర ప్రాంతాన్ని తాకింది. ఇక్కడి ఓడరేవు మునిగిపోయింది. ఈ ప్రాంతంలో దాదాపు 2వేల మంది ప్రజలు నివసిస్తున్నారని రష్యా అత్యవసర మంత్రిత్వశాఖ తెలిపింది. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది. సఖాలిన్‌ ద్వీపంలోని నివాసితులను ఖాళీ చేస్తున్నామని, అత్యవసర సేవలు పూర్తిసామర్థ్యంతో పనిచేస్తున్నాయని స్థానిక రష్యన్ అధికారి తెలిపారు. ఇక, సునామీ కారణంగా జపాన్‌లో 3 మీటర్ల వరకు అలలు ఎగసిపడుతున్నాయని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఎవరూ సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు చేసింది.



Tags :
Published : 30 Jul 2025 06:43 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు