US Government Shutdown: షట్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. అమెరికా సంపదలో రూ.62వేలకోట్లు ఆవిరి..!

Eenadu icon
By International News Team Published : 01 Nov 2025 13:00 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: కీలకమైన బిల్లుల విషయంలో అధికార, విపక్ష చట్టసభ సభ్యుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ను ఎదుర్కొంటోంది (US Government Shutdown). 31 రోజులుగా అగ్రదేశ ఆర్థిక వ్యవస్థ మూసివేత కొనసాగుతోంది. దానివల్ల అమెరికా సంపదలో 7 బిలియన్‌ డాలర్లు (రూ.62,149 కోట్లకు పైగా) ఆవిరయింది. ఈ మేరకు కాంగ్రెషనల్‌ బడ్జెట్‌ ఆఫీస్‌ అంచనా వేసింది.

‘‘ఈ షట్‌డౌన్ వల్ల అమెరికా (USA) ఆర్థిక వ్యవస్థ నుంచి 7 బిలియన్ డాలర్ల సంపద శాశ్వతంగా ఆవిరైంది. ఇది ఇంకా కొనసాగితే.. ఆరు వారాలకు 11 బిలియన్‌ డాలర్లు, ఎనిమిది వారాలకు 14 బిలియన్ డాలర్ల మేర ఆర్థికనష్టం ఏర్పడుతుంది’’ అని బడ్జెట్ ఆఫీస్ అంచనాలు విడుదల చేసింది. ఈ షట్‌డౌన్ ఎఫెక్ట్ చిన్నగా మొదలై ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందని కేపీఎంజీ సంస్థలోని చీఫ్ ఎకానమిస్ట్ డయాన్‌ స్వాంక్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ఆర్థికవ్యవస్థ బలహీనంగా ఉంది. ఈ షట్‌డౌన్‌ వంటివి ఊహించిన దానికంటే పెద్ద సమస్యగా పరిణమించొచ్చు’’ అని మూడీస్ అనలిటిక్స్‌కు చెందిన మార్క్‌ జాండీ హెచ్చరించారు.

1981 నుంచి అమెరికా ప్రభుత్వం 15 సార్లు మూతపడింది. అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు ప్రభుత్వం మూత పడింది. దేశ చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్‌డౌన్‌గా నిలిచింది. ప్రస్తుతం చట్టసభ సభ్యుల్లో రాజీ సూచనలు కనిపించకపోవడంతో.. గత రికార్డును దాటి ఈ షట్‌డౌన్ మరింతకాలం కొనసాగుతుందా..? అనే ఆందోళన వ్యక్తమవుతోంది (American Economy). 

ఇప్పటికే బలహీనంగా ఉన్న జాబ్‌ మార్కెట్‌పై ఈ ప్రభావం కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. ఆర్థిక, విధానపరమైన అనిశ్చితి కారణంగా పలు సంస్థలు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మరికొన్ని కృత్రిమమేధ, ఆటోమేషన్‌ను పరీక్షిస్తున్నాయి. ఇవన్నీ ఉద్యోగాలకు కోత పెడుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ మూసివేత (Shutdown) వల్ల వెంటనే ఆర్థిక ప్రభావం పడకపోయినా.. దీర్ఘకాలంగా కొనసాగితే మాత్రం ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. మార్కెట్లకు అంతరాయం కలిగిస్తుంది. ఇవన్నీ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని, ప్రతివారం ఆర్థిక వృద్ధిలో 0.1 నుంచి 0.2 పాయింట్లు తగ్గొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు