Work from home: ఆ దేశమంతా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. కారణమేమిటంటే..?

ఆ దేశంలోని ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేయాలని (work from home) తాజాగా ఆ దేశాధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. 

Published : 18 Apr 2024 18:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌(work from home) విధానానికి స్వస్తి పలుకుతుంటే.. ఓ దేశం మాత్రం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల్ని ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించింది. ఈమేరకు ఆ దేశాధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు.

దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్‌ (Ecuador)లోని ఉద్యోగులు గురు, శుక్రవారాలు ఇంటి నుంచే పని చేయాలని అధ్యక్షుడు డేనియల్ నొబోవా వెల్లడించారు. ఇందుకు ఇంధన సంక్షోభం కారణమైంది. హైడ్రోఎలక్ట్రిక్‌ ప్లాంట్ల లో నీటిస్థాయిలు అడుగంటిపోవడంతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఆ దేశ అతిపెద్ద పవర్‌ప్లాంట్‌ కొకా కొడా సిన్‌క్లెయిర్‌లో నీటి స్థాయిలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. ఇది సంక్షోభానికి దారితీసింది. పర్యావరణ పరిస్థితులే కాకుండా అవినీతి, నిర్లక్ష్యం కూడా ఇందుకు దోహదం చేసినట్లు డేనియల్ ఆరోపించారు. పరిస్థితి తీవ్రతను దాచి, ఉన్నతాధికారులు విధ్వంసానికి పాల్పడ్డారని మండిపడ్డారు. అలాగే ప్రస్తుతమున్న ఎనర్జీ మంత్రిని తొలగించి, కొత్తవారిని నియమించారు. తగినంత వర్షాలు లేకపోవడంతో పొరుగుదేశమైన కొలంబియా ఎలక్ట్రిసిటీ ఎగుమతిని నిలిపివేసిన సమయంలోనే ఈ వర్క్‌ ఫ్రమ్‌హోమ్‌ ప్రకటన వచ్చింది.

సోషల్‌ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు

ఇదిలా ఉంటే.. అవినీతి ఆరోపణలతో పూర్వ అధ్యక్షుడు గిలెర్మో లాస్సో పార్లమెంటును అర్థంతరంగా రద్దు చేయడంతో మధ్యంతర ఎన్నికల్లో 35 ఏళ్ల డేనియల్ విజయం సాధించారు. 2023 చివర్లో ఆ పదవిని చేపట్టారు. ప్రస్తుతం ఆ దేశంలో శాంతిభద్రతల సమస్య నెలకొని ఉంది. జనవరిలో జైళ్ల నుంచి ఇద్దరు మాదకద్రవ్యాల స్మగ్లర్లు తప్పించుకున్నారు. ఆ తర్వాతే దేశంలో వరుసగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. స్వయంగా అధ్యక్షుడికే హెచ్చరిక సందేశాలు పంపారు. ఈనేపథ్యంలో కఠిన చర్యలకు ఆదేశించిన అధ్యక్షుడు.. ఉగ్ర ముఠాలకు చెందిన సభ్యులు ఎక్కడ కనిపించినా అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా వారిని హత మార్చేందుకు సైనికులకు అధికారం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని