Trudeau- Elon Musk: ట్రూడో మీకిది సిగ్గుచేటు.. విరుచుకుపడ్డ ఎలాన్‌ మస్క్‌

Trudeau- Elon Musk: కెనడాలో ట్రూడో ప్రభుత్వం వాక్‌ స్వేచ్ఛను అణచివేస్తోందంటూ ఎక్స్‌ (ట్విటర్‌) యజమాని ఎలాన్‌ మస్క్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated : 02 Oct 2023 10:31 IST

ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau)పై స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) విరుచుకుపడ్డారు. వాక్‌ స్వాతంత్ర్యాన్ని అణచివేస్తున్నారని దుయ్యబట్టారు. ఇది ‘‘సిగ్గుచేటు’’ చర్య అని విమర్శించారు. ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ కంపెనీలు కచ్చితంగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలని ఇటీవల ట్రూడో (Justin Trudeau) ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీన్ని ప్రముఖ జర్నలిస్ట్‌ గ్లెన్‌ గ్రీన్‌వాల్డ్‌ ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. దీనికి స్పందిస్తూ మస్క్‌ (Elon Musk).. పై వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచంలో అత్యంత అణచివేతతో కూడిన ఆన్‌లైన్ సెన్సార్‌షిప్ నిబంధనలు కెనడాలో ఉన్నాయని గ్లెన్‌ తన పోస్టులో రాసుకొచ్చారు. పాడ్‌కాస్ట్‌లను అందించే ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థలపై నియంత్రణ కోసం ట్రూడో (Justin Trudeau) ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా ఆయా కంపెనీలు ప్రభుత్వం వద్ద అధికారికంగా నమోదు చేసుకోవాలని ఆదేశించినట్లు వెల్లడించారు. దీనిపై మస్క్‌ (Elon Musk) స్పందిస్తూ.. ‘‘కెనడాలో వాక్ స్వేచ్ఛను అణచివేసేందుకు ట్రూడో ప్రయత్నిస్తున్నారు. సిగ్గుచేటు’’ అని రాసుకొచ్చారు. ఇలా వాక్‌ స్వేచ్ఛపై ట్రూడో (Justin Trudeau) ప్రభుత్వం దాడి చేస్తోందంటూ గతంలోనూ విమర్శలున్నాయి. కొవిడ్‌ వ్యాక్సిన్లను తప్పనిసరి చేస్తూ 2022 ఫిబ్రవరిలో కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదేశాలను అక్కడి ట్రక్కు డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వీరిని అణచివేసేందుకు కెనడా చరిత్రలోనే ట్రూడో తొలిసారి ఎమర్జెన్సీ అధికారాలను అమలు చేశారు.

దారి తప్పుతున్న విమానాలు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది?

మరోవైపు భారత్‌, కెనడా మధ్య దౌత్య సంబంధాలు రోజురోజుకీ దిగజారుతున్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారత్‌ ఏజెన్సీల హస్తం ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలు ఇరు దేశాల మధ్య నిప్పును రాజేశాయి. వీటిని తీవ్రంగా ఖండించిన భారత్‌ ఆధారాలు చూపించాలని బలంగా డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలో భారత్‌ ఇప్పటికే ఆ దేశవాసులకు వీసా సేవలను నిలిపివేసింది. మరోవైపు భారత్‌లోని కెనడా సీనియర్‌ దౌత్యాధికారిని తిప్పి పంపింది. ఇక్కడ కెనడా దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని