అక్కడ ప్రభుత్వ ‘డేటింగ్‌ యాప్‌’.. హ్యాపీ అంటోన్న ఎలాన్‌ మస్క్‌

జపాన్‌ తీసుకున్న ఓ నిర్ణయంపై ఎలాన్‌ మస్క్‌(Elon Musk) సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు అవసరమని వ్యాఖ్యానించారు.

Published : 06 Jun 2024 12:36 IST

టోక్యో: నాగరికతను కాపాడుకోవడానికి ఎక్కువ మంది పిల్లలు ఉండాల్సిన అవసరం ఉందంటూ పలుమార్లు చెప్తుంటారు టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk). జననాల రేటును పెంచడానికి తాజాగా జపాన్ (Japan) తీసుకున్న నిర్ణయంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. టోక్యో స్థానిక యంత్రాంగం ఒక డేటింగ్‌ యాప్‌ను లాంచ్‌ చేయడమే అందుకు కారణం. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం..

జననాల రేటును పెంచేందుకు ఈ వేసవిలో టోక్యో ఒక డేటింగ్ యాప్‌ను తీసుకురానుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం వినియోగదారులు కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. తాము ఒంటరని ధ్రువీకరించే పత్రాలతో పాటు పెళ్లి చేసుకోవడానికి సుముఖంగా ఉన్నామని సంతకాలు చేసిన లేఖను ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వార్షిక వేతనం నిజమేనని నిరూపించేలా ఒక ట్యాక్స్ సర్టిఫికెట్‌ను ఇవ్వాలి. మామూలుగా ఇలాంటి డేటింగ్ యాప్స్‌ను ప్రభుత్వాలు తీసుకురావడం అరుదు. అయితే ప్రపంచంలో అతిపెద్ద మూడో ఆర్థికవ్యవస్థ కలిగిన జపాన్‌ (Japan)లో గత కొన్నేళ్లుగా జనాభా పెరుగుదల రేటు భారీగా పడిపోతోంది. ఆ దేశ జననాల రేటు వరుసగా ఎనిమిదేళ్లుగా క్షీణిస్తూ వస్తోంది. 2023లో అది రికార్డు స్థాయి కనిష్ఠానికి పడిపోయింది. అధికారిక గణాంకాల ప్రకారం..కొత్తగా భూమ్మీదకు వచ్చేవారి సంఖ్య కంటే మరణాల రేటు రెట్టింపుగా నమోదైంది. జననాల రేటు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 5.1 శాతానికి పడిపోయి 7,58,631కు చేరుకుంది. అలాగే వివాహాల సంఖ్య 90 ఏళ్లకాలంలో మొదటిసారి 5 లక్షల దిగువకు పడిపోయింది. గత సంవత్సర కాలంలో అక్కడ 4,89,281 మంది మాత్రమే వివాహం చేసుకున్నారు.

ఈ ఏఐ టూల్‌ సాయంతో మీ భవిష్యత్‌తో మీరు మాట్లాడొచ్చు!

జననాల రేటు తగ్గడంపై ఆ దేశ ప్రధాని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తమ దేశం ఎదుర్కొంటోన్న తీవ్ర సంక్షోభమని అభివర్ణించారు. ఇదే ధోరణి కొనసాగితే 2070 నాటికి జనాభా 30 శాతం కుచించుకుపోయి 87 మిలియన్లకు పడిపోతుందని అంచనా. అంతేగాకుండా ప్రతి పది మందిలో నలుగురు 65 ఏళ్లు లేదా ఆపైబడిన వారే ఉంటారని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రిసెర్చ్‌ పేర్కొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో టోక్యో యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘వివాహం చేసుకోవాలనే ఆలోచన ఉన్నవారిలో 70 శాతం మంది తమ భాగస్వామిని వెతుక్కునే క్రమంలో ఎలాంటి యాప్స్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిసింది. వారు తగిన భాగస్వామిని ఎంచుకునేందుకు ఈ మార్గం ఉపకరిస్తుందనుకుంటున్నాం’’ అని ఒక అధికారి మీడియాకు వెల్లడించారు.

ఈ ప్రయత్నంపై మస్క్‌ స్పందిస్తూ..‘‘ఈ అంశం ప్రాముఖ్యతను జపాన్ ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషంగా ఉంది. ఈ తరహా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకపోతే.. జపాన్‌ వంటి దేశాలు అదృశ్యమవుతాయి’’ అని వ్యాఖ్యానించారు. క్రమంగా క్షీణిస్తోన్న జననాల రేటులో మార్పు రాకపోతే రానున్న రోజుల్లో జపాన్‌ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందంటూ ఆయన గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. ‘‘నాగరికతను కాపాడుకోవడానికి పిల్లలు ఉండాల్సిన అవసరం ఉంది. నాగరికత క్షీణించిపోవడాన్ని చూస్తూ ఉండలేం’’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే అధిక సంతానం పర్యావరణానికి హాని కలిగిస్తుందనే వాదనను తోసిపుచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని