Ukraine- StarLink: ఇలా అయితే యుద్ధ సమయంలో కష్టమే.. స్టార్‌లింక్‌ ఉదంతంపై అమెరికా ఆందోళన!

Ukraine- StarLink: ఉక్రెయిన్‌లో గత ఏడాది ఎలాన్‌ మస్క్‌ తమ స్టార్‌లింక్‌ సేవలను వినియోగించుకోవడానికి అనుమతినివ్వలేదు. దీంతో అమెరికా రక్షణ వర్గాల్లో ఇప్పుడు ఆందోళన మొదలైంది.

Updated : 12 Sep 2023 13:59 IST

నేషనల్‌ హార్బర్‌: ఉక్రెయిన్‌ (Ukraine)లో గత ఏడాది స్టార్‌లింక్‌ (StarLink) సేవలను వినియోగించుకునేందుకు స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) అనుమతినివ్వకపోడం అమెరికా రక్షణ వర్గాలను సందేహంలో పడేశాయి. ప్రైవేటు సంస్థలు, వ్యక్తులపై ఆధారపడితే యుద్ధం వంటి కీలక సమయాల్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో ఈ ఉదంతం వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో సైనికపరమైన ఒప్పందాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సంఘటన గుర్తుచేసిందని అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ కార్యదర్శి ఫ్రాంక్‌ కెండల్‌ సోమవారం తెలిపారు.

ప్రముఖ రచయిత వాల్టర్‌ ఐజాక్సన్‌ రాసిన ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఈ పుస్తకం నేడు అమెరికాలో విడుదల కానుంది. దీంట్లో ఉక్రెయిన్‌కు స్టార్‌లింక్‌ (StarLink) సేవలను అందించడంపై కూడా పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబరులో సెవెస్టొపోల్‌ పోర్ట్‌లోని రష్యా నావికా దళానికి చెందిన నౌకలను ధ్వంసం చేసేందుకు ఉక్రెయిన్‌.. ఎలాన్‌ మస్క్‌ సాయం కోరింది. దాడికి వీలుగా క్రిమియాలో స్టార్‌లింక్‌ (StarLink) సేవలను అందించాలని అడిగింది. దీనిని మస్క్‌ (Elon Musk) తిరస్కరించారు. ఈ విషయాన్ని ఇటీవల ఆయన స్వయంగా అంగీకరించారు. ప్రతిదాడిగా రష్యా అణ్వస్త్రాలను ప్రయోగించే ప్రమాదం ఉందనే ఆందోళనతోనే తాను ఆ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. ఇది జరిగిన సమయంలో ఉక్రెయిన్‌తో స్టార్‌లింక్‌ (StarLink)కు ఎలాంటి ఒప్పందం కుదరలేదు. అప్పటికి మస్క్‌ ఉచితంగానే తమ సేవలను వినియోగించుకునేందుకు ఉక్రెయిన్‌ సైన్యానికి అనుమతి ఇచ్చారు. 2014లో రష్యా క్రిమియాను తమ అధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

చైనా బెల్ట్‌కు చెక్‌!

తర్వాత కొన్ని నెలల్లో అమెరికా ఈ విషయంలో జోక్యం చేసుకుంది. ఉక్రెయిన్‌కు నిరంతర సేవలు అందించేలా స్టార్‌లింక్‌తో ఒప్పందం కుదుర్చుకొంది. అయితే, ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒప్పంద షరతులను.. స్టార్‌లింక్‌కు చెల్లించే మొత్తాన్ని మాత్రం అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ బయటకు వెల్లడించలేదు. కేవలం ఉక్రెయిన్‌ విషయంలోనే కాకుండా అమెరికా ఇతర విషయాల్లోనూ స్పేస్‌ఎక్స్‌పై ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో కీలక సమయాల్లో ఇలా వాణిజ్య సేవలు అందించేవారు తిరస్కరిస్తే పరిస్థితి ఏంటనేదానిపై ఆందోళన నెలకొందని కెండల్‌ తాజాగా వెల్లడించారు. ఫలితంగా రాబోయే రోజుల్లో సైనికపరమైన ఒప్పందాల విషయంలో ఎలా వ్యవహరించాలో చర్చిస్తున్నామని తెలిపారు.

‘‘ఇలా ఏదైనా సైనిక కార్యాచరణను అమలు చేసే సమయంలో వాణిజ్యపరంగా సేలందించే సంస్థలు, వ్యవస్థలపై ఆధారపడాలంటే వారి నుంచి కచ్చితంగా కొన్ని హామీలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వారు వారిష్టానికి వ్యవహరించే అవకాశం ఉంది. శాంతిని నెలకొల్పాల్సిన సమయంలో ఆర్థికపరమైన డిమాండ్లు తలెత్తొచ్చు. యుద్ధంలాంటి సమయంలో ఇలాంటి సేవలపై ఆధారపడడం ఏమాత్రం మంచిది కాదు’’ అని కెండల్‌ అన్నారు. కేవలం ఉక్రెయిన్‌ విషయంలోనే కాకుండా అమెరికా సైనిక వర్గాలు స్సేస్‌ఎక్స్‌తో ఇతర ఒప్పందాలూ కుదుర్చుకున్నాయి. యుద్ధం, విపత్తుల వంటి అత్యవసర సమయాల్లో తమ సామగ్రిని అత్యంత వేగంగా తరలించేలా ఓ రాకెట్‌ షిప్‌ను అభివృద్ధి చేసే నిమిత్తం అమెరికా వాయుసేనకు చెందిన ‘ఎయిర్‌ మొబిలిటీ కమాండ్‌’.. స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని