చైనా బెల్ట్‌కు చెక్‌!

ప్రపంచ ఆర్థిక సమస్యలకు పరిష్కారం కోసం ఏర్పాటైన జీ20 సరికొత్త భౌగోళిక రాజకీయానికి పునాది వేస్తోందా? రష్యా, చైనాల గైర్హాజరీలో దిల్లీ జీ20 వేదికగా జరిగిన ఓ ఒప్పందం ఆ సంకేతాలనే ఇస్తోంది.

Updated : 12 Sep 2023 09:23 IST

భారత్‌ నుంచి ఐరోపాకు నౌక, రైలు ఆర్థిక నడవా
ఇండియా, యూఏఈ, సౌదీ, ఇజ్రాయెల్‌, ఈయూ భాగస్వాములు
తర్వాత ఆఫ్రికాకూ పొడిగించే యోచన

ప్రపంచ ఆర్థిక సమస్యలకు పరిష్కారం కోసం ఏర్పాటైన జీ20 సరికొత్త భౌగోళిక రాజకీయానికి పునాది వేస్తోందా? రష్యా, చైనాల గైర్హాజరీలో దిల్లీ జీ20 వేదికగా జరిగిన ఓ ఒప్పందం ఆ సంకేతాలనే ఇస్తోంది. భిన్నధ్రువ ప్రపంచంలో భౌగోళిక రాజకీయాలను శాసించాలని చూస్తున్న చైనాకు అమెరికా భారీ షాక్‌ ఇవ్వటానికి సిద్ధమైంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ కల... బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ ప్రాజెక్ట్‌కు పోటీగా భారత్‌ నుంచి ఐరోపా దాకా భారీ నౌకా, రైలు మార్గాలతో కూడిన అతిపెద్ద ఆర్థిక కారిడార్‌కు అమెరికా తెరలేపింది. జీ-20 సదస్సు సమయంలోనే ప్రకటించిన భారత్‌-మధ్య ఆసియా-ఈయూ ఆర్థిక నడవా అదే.

ఎవరు భాగస్వాములు?

భారత్‌, యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్‌, ఇజ్రాయెల్‌లతోపాటు యూరోపియన్‌ యూనియన్‌లు ఈ భారీ ఆర్థిక నడవాలో భాగస్వాములు.

ఏం చేస్తారు?

అరేబియన్‌ ద్వీపకల్పంలో యూఏఈ, సౌదీ తదితర దేశాలను కలుపుతూ రైలు మార్గాలు నిర్మిస్తారు. తర్వాత... ఇటు భారత్‌తో, అటు ఐరోపాతో నౌకా మార్గాలను అనుసంధానిస్తారు. తర్వాతి దశలో దీన్ని ఐరోపా నుంచి ఆఫ్రికాకు విస్తరించే అవకాశాలున్నాయి.

ఏం జరుగుతుంది?

వివిధ దేశాల మధ్య నౌకాశ్రయాలు, రైలు మార్గాలను కలుపుతూ సాగే ఈ ఒప్పందం వాణిజ్యపరంగా చాలా కీలకం, ప్రయోజనకారి అవుతుంది. ఈ ఒప్పందం అమలులోకి వస్తే నౌకా రవాణా ఖర్చులు, వాణిజ్య, ఇంధన ఖర్చులు తగ్గుతాయి. వాణిజ్యం వేగమంతమవుతుంది కూడా. ఈ నడవాలో భాగంగా వచ్చే అనేక దేశాల్లోకి భారీగా పెట్టుబడులు ప్రవహిస్తాయి. ఆయా దేశాల మధ్య వాణిజ్యం 40% వృద్ధి చెందుతుంది. మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడులు పెరుగుతాయి. హరిత హైడ్రోజన్‌ ఉత్పత్తి, రవాణాలు సులభమవుతాయి. రైల్వేలు, పోర్టుల నిర్మాణంతోపాటు విద్యుత్‌, డేటా వ్యవస్థల్లోకి కూడా పెట్టుబడులు పెడతారు.

ఎందుకీ ప్రాజెక్టు?

బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ (బీఆర్‌ఐ) అంటూ 2013లో చైనా భారీ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టు ఆరంభించింది. తొలుత దీన్ని చైనాలోని తీరప్రాంత పట్టణాలను కలుపుతూ నిర్మించాలని అనుకున్నారు. కానీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఈ ప్రాజెక్టును చైనాను దాటి ఆసియా, ఐరోపా, ఆఫ్రికా దేశాలకూ విస్తరింపజేశారు. భారత్‌ ఇందులో చేరలేదు. మొదట కేవలం రోడ్లు, నౌకాశ్రయాల్లాంటి వాటికే పరిమితమవుతుందనుకున్న ప్రాజెక్టు టెలికాం, వాణిజ్యం, కృత్రిమమేధ, నిఘా సాంకేతికత, ఆరోగ్యం, ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్స్‌, స్మార్ట్‌ సిటీల నిర్మాణం... ఇలా అన్నిరంగాల్లోకీ విస్తరించింది. చైనా బ్యాంకులు, కంపెనీలు భారీఎత్తున ఆసియాతో పాటు ఐరోపా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల్లోని అనేక దేశాల్లో పెట్టుబడులు పెడుతూ తమ దేశ ప్రాబల్యాన్ని పెంచుతున్నాయి. అభివృద్ధి అనే గాలానికి చిక్కి అనేక దేశాలు చైనా అప్పుల ఊబిలో ఇరుక్కుపోయాయి. తన సన్నిహిత ఐరోపా దేశాలు సైతం పెట్టుబడులపై ఆశతో చైనాకు దగ్గరవుతుండటం అమెరికాను పునరాలోచనలో పడేసింది. అంతేగాకుండా... ఆసియా, ఆఫ్రికా, ఐరోపాల్లో బెల్ట్‌ ప్రాజెక్టు రూపంలో పరోక్షంగా చైనా ప్రాబల్యం పెరుగుతుండటంతో అమెరికా కళ్లు తెరచింది. ‘బెల్ట్‌ ప్రాజెక్టు వల్ల అనేక దేశాలు చైనా రుణాల ఊబిలో కూరుకుపోతున్నాయి. క్రమంగా ఇవి చైనా చెప్పినట్లు వినటం వినా మరో మార్గం లేని పరిస్థితి తలెత్తుతుంది. అదే జరిగితే పర్యావరణ మార్పుల ఉద్యమంతో పాటు భౌగోళిక రాజకీయాల్లోనూ ఇబ్బందులు ఎదురవుతాయి’ అని అమెరికా విదేశాంగనీతిపై ఏర్పాటైన ఓ మండలి నివేదిక బైడెన్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పైగా ఈ మధ్య గల్ఫ్‌, అరబ్‌ దేశాల వ్యవహారాల్లో చైనా పెత్తనం పెరుగుతోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని... చైనాకు చెక్‌ పెట్టాలన్న ఉద్దేశంతో అమెరికా బెల్ట్‌కు పోటీగా ఓ భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును చురుగ్గా ముందుకు తీసుకొచ్చింది.

ఐ2యూ2లోనే అంకురం

దిల్లీ జీ20 శిఖరాగ్ర భేటీ సందర్భంగా ఈ ప్రాజెక్టువెలుగులోకి వచ్చినా... దీనిపై అమెరికా, భారత్‌, యూఏఈ, సౌదీల మధ్య చాలాకాలంగా చర్చలు జరుగుతున్నాయి. నిరుడు జరిగిన ఐ2యూ2 సమావేశంలోనే ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తొలుత దీన్ని ఇజ్రాయెల్‌ ప్రతిపాదించినట్లుగా సమాచారం. ఐ2యూ2 అనేది భారత్‌, ఇజ్రాయెల్‌, యూఏఈ, అమెరికాలతో కూడిన ఓ కూటమి. ఈ ప్రతిపాదనకు అంగీకరించిన వెంటనే ఇందులో సౌదీ అరేబియాను కూడా చేర్చాలని అమెరికా సూచించింది. అందుకు అనుగుణంగానే అమెరికా జాతీయ భద్రత సలహాదారు జాక్‌ సులివాన్‌ కొద్దికాలంగా చర్చలు కొనసాగిస్తున్నారు. అరబ్‌ దేశాలు, ఇజ్రాయెల్‌ మధ్య సయోధ్య కోసం కూడా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.

ఆసియా పసిఫిక్‌లో...

వ్యూహాత్మకంగా కీలకమైన ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో తన ప్రాబల్యం ఉండేలా చూసుకోవటానికి, చైనాను కట్టడి చేయటానికి ఈ ప్రాజెక్టు అమెరికాకు ఉపయోగపడుతుంది. ప్రపంచ మౌలిక సదుపాయాల పెట్టుబడుల్లో తాము వెనకబడుతున్నట్లు గుర్తించిన అమెరికా.. .2027నాటికి 200 బిలియన్‌ డాలర్లను పెట్టుబడులకు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. వీటిని వివిధ దేశాల్లో ముఖ్యంగా పసిఫిక్‌, గల్ఫ్‌, ఆఫ్రికా దేశాల్లో వినియోగించబోతున్నారు. తద్వారా ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో తన ప్రాభవాన్ని పునరుద్ధరించుకోవటానికి అమెరికాకూ ఈ ప్రాజెక్టు ఓ అవకాశం!


భారత్‌కేంటి లాభం?

చైనా బెల్ట్‌ పథకంలో భారత్‌ చేరలేదు. భూ మార్గంలో పశ్చిమంతో వాణిజ్యం చేయాలంటే పాకిస్థాన్‌ మనకు అడ్డుపడుతోంది. ఈ తాజా ప్రాజెక్టుతో అరేబియన్‌ ద్వీపకల్పంతో భారత్‌ వాణిజ్య బంధం బలోపేతమవుతుంది. ఎలాగూ... గత కొద్దికాలంగా గల్ఫ్‌ దేశాలతో మోదీ సర్కారు దౌత్యపరంగా సత్సంబంధాలు నెలకొల్పింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుతో అది సద్వినియోగమవుతుంది. మరోవైపు... చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్డు ప్రాజెక్టుకు పోటీ అవుతుంది. చైనా బెల్ట్‌పై ఆశతో వారి నుంచి రుణాలు తీసుకొని ఇబ్బంది పడుతున్న అనేక దేశాలకు ఇది ఆశాకిరణం. ఇప్పటికే చాలా దేశాలు చైనా అప్పుల ఊబిలోంచి బయటపడటానికి దారులు వెదుకుతున్నాయి. తాజాగా... ఇటలీ బెల్ట్‌ ప్రాజెక్టు నుంచి బయటకు వస్తున్నట్లు సంకేతాలిచ్చింది.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని