USA: ఉగ్రవాదుల్ని వెంటాడి మట్టుబెడతామంటూ మోదీ హెచ్చరిక..అమెరికా ఏమందంటే..?

దేశంలో శాంతికి విఘాతం కలిగించేందుకు ఏ ఉగ్రవాది అయినా ప్రయత్నిస్తే.. తగిన సమాధానం చెప్తామని, ఒకవేళ వారు పాకిస్థాన్‌కు పారిపోయినా వదలమని మనదేశం హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా అమెరికా (USA) స్పందించింది. 

Updated : 17 Apr 2024 11:09 IST

వాషింగ్టన్‌: భారత్‌-పాకిస్థాన్‌ (India-Pakistan) మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా (USA) మరోసారి సూచించింది. ఉగ్రవాదులు ఎక్కడికి పారిపోయినా.. అక్కడికి వెళ్లి మరీ అంతంచేస్తామని ఇటీవల ప్రధాని మోదీ (Modi), రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ స్పందన వచ్చింది.

‘‘ఇప్పటికే చెప్పినట్టుగా..రెండు దేశాల మధ్య అమెరికా (USA) జోక్యం చేసుకోవడం లేదు. కానీ, ఉద్రిక్తతలు నివారణకు ఆ దేశాలు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని సూచిస్తున్నాం’’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు. పాకిస్థాన్‌ (Pakistan)లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుక భారత్‌ హస్తం ఉందంటూ యూకే మీడియా రాసిన కథనంపై కూడా ఆయన ఇదే తరహాలో స్పందించారు.

భారత ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నాం: జర్మనీ

2019లో పుల్వామా ఘటన తర్వాత నుంచి భారత్‌కు ప్రమాదకరంగా మారుతున్న వ్యక్తులను న్యూదిల్లీ లక్ష్యంగా చేసుకొందని బ్రిటన్‌కు చెందిన ‘ది గార్డియన్‌’ పత్రిక కథనంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. విదేశీ ఇంటెలిజెన్స్‌ సంస్థ ‘రా’ దాదాపు 20 హత్యలు చేయించి ఉంటుందని ఆరోపించింది. ఈ కథనాన్ని మన విదేశాంగశాఖ ఖండించింది. అదంతా తప్పుడు సమాచారమని స్పష్టం చేసింది. అయితే మోదీ, రాజ్‌నాథ్ మాత్రం.. ఉగ్రవాదులను అంతం చేసేందుకు ఎక్కడికైనా వెళతామని తేల్చిచెప్పారు.

ఇక ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు అమెరికా గడ్డపై కుట్రపన్నిందని భారత్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో న్యూదిల్లీపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదని ప్రశ్నించగా.. ‘‘ఇది మేం బహిరంగంగా చర్చించే అంశం కాదు’’ అని మిల్లర్‌ సమాధానం ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని