Indian Navy: మరో పడవ హైజాక్‌.. రంగంలోకి భారత నేవీ

అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన ఓ ఇరాన్‌ పడవను రక్షించేందుకు భారత నౌకాదళం (Indian Navy) మరోసారి రంగంలోకి దిగింది.

Published : 30 Mar 2024 00:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సముద్రపు దొంగల (Pirates) ఆటకట్టించేందుకు భారత నౌకాదళం (Indian Navy) మరోసారి రంగంలోకి దిగింది. అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన ఓ ఇరాన్‌ బోటును రక్షించే ఆపరేషన్‌లో నిమగ్నమైనట్లు నేవీ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఆ పడవను తొమ్మిది మంది సాయుధ పైరట్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు సమాచారం అందిందన్నారు.

యెమెన్‌కు చెందిన సోకోట్రా ద్వీపసమూహానికి దాదాపు 90 నాటికల్‌ మైళ్ల దూరంలో ఓ ఇరాన్‌ చేపల బోటు (Al Kambar 786) గురువారం సముద్రపు దొంగల చేతికి చిక్కినట్లు భారత నౌకాదళానికి సమాచారం అందింది. దీంతో సముద్ర భద్రత కార్యకలాపాల కోసం అరేబియా సముద్రంలో మోహరించిన రెండు నౌకలను.. ఆ బోటును కాపాడేందుకుగానూ రంగంలోకి దించింది. ‘‘హైజాక్‌కు గురైన బోటును, దాని సిబ్బందిని రక్షించేందుకు ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో సముద్ర, నావికుల భద్రతకు కట్టుబడి ఉన్నాం’ అని నౌకాదళం ఓ ప్రకటనలో తెలిపింది.

సముద్ర జలాల్లో 90కి పైగా ఘటనలు.. 110 మందిని కాపాడాం : భారత నేవీ

కొంత కాలంగా అరేబియా, ఎర్ర సముద్రాల్లో వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధిత నౌకలకు భారత నేవీ అండగా నిలుస్తోంది. గతేడాది నవంబర్‌ నుంచి 90కిపైగా ఇలాంటి ఘటనలు జరిగాయని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్‌.హరికుమార్ ఇటీవల వెల్లడించారు. ఆయా ఆపరేషన్లలో 5వేలకు పైగా నేవీ సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 110 మంది ప్రాణాలు కాపాడామని, వారిలో 45 మంది భారతీయులు, 65 మంది విదేశీయులు ఉన్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని