Indian Navy: సముద్ర జలాల్లో 90కి పైగా ఘటనలు.. 110 మందిని కాపాడాం : భారత నేవీ

అరేబియా, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుస దాడుల వేళ.. భారత నేవీ(Indian Navy) చురుగ్గా స్పందిస్తోంది. ఇప్పటివరకు 110 మందిని కాపాడింది. 

Updated : 23 Mar 2024 18:52 IST

ముంబయి: ఇటీవల కాలంలో అరేబియా, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దాడులకు గురవుతున్న విదేశీ నౌకలకు భారత నేవీ (Indian Navy) అండగా నిలుస్తోంది. గత నవంబర్‌ నుంచి 90కిపైగా ఇలాంటి ఘటనలు జరిగాయని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్‌.హరికుమార్ వెల్లడించారు.

‘గత నవంబర్ నుంచి మార్చి వరకు సముద్ర జలాల్లో 90కి పైగా డ్రోన్లు, క్షిపణులు, సముద్రపు దొంగల దాడులు జరిగాయి. ఈ క్రమంలో నిర్వహిస్తోన్న ఆపరేషన్లలో 5వేలకు పైగా నేవీ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే 21 నౌకలను రంగంలోకి దింపాం. గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌లో చోటుచేసుకున్న ఐదు ప్రధాన ఘటనలపై మేం స్పందించాం. 110 మంది ప్రాణాలు కాపాడాం. వారిలో 45 మంది భారతీయులు, 65 మంది విదేశీయులు ఉన్నారు’ అని తెలిపారు.

ఇందులోభాగంగానే సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్‌కు గురైన ఓ వాణిజ్య ఓడను భారత నౌకాదళం కాపాడిన విషయం తెలిసిందే. మెరైన్‌ కమాండోలూ కిందికి దిగి.. దొంగల ఆట కట్టించారు. మొత్తం 17 మంది బందీలను విడిపించి 35 మంది సముద్రపు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ 35 మందిని నేవీ ఈ రోజు ముంబయికి తీసుకువచ్చింది. చట్ట ప్రక్రియలో భాగంగా వారిని ముంబయి పోలీసులకు అప్పగించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని