EUCO: రూ.4 లక్షల కోట్లు.. ఉక్రెయిన్‌కు ‘ఈయూ’ సాయం!

ఉక్రెయిన్‌కు ఐరోపా సమాఖ్య రూ.4 లక్షల కోట్ల సహాయ ప్యాకేజీని ప్రకటించింది.

Published : 02 Feb 2024 01:52 IST

బ్రసెల్స్‌: రష్యా దండయాత్రకు రెండేళ్లు సమీపిస్తోన్న వేళ.. ఉక్రెయిన్‌కు ఐరోపా సమాఖ్య (EU) భారీ సాయం ప్రకటించింది. నాలుగేళ్లలో రూ.4 లక్షల కోట్లు అందజేసేందుకు సమాఖ్యలోని 27 దేశాల నేతలు అంగీకరించారు. గతేడాది డిసెంబరులో నిర్వహించిన ఈయూ సమావేశంలోనే ఈ సహాయ ప్యాకేజీని ప్రతిపాదించినప్పటికీ.. హంగేరీ వ్యతిరేకించింది. బ్రసెల్స్‌లో నిర్వహించిన తాజా సమావేశంలో అన్ని సభ్యదేశాలు పచ్చజెండా ఊపినట్లు ఈయూ కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మైకేల్‌ వెల్లడించారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచే బాధ్యతను ఈయూ తీసుకుంటుందన్నారు.

రష్యాతో యుద్ధం.. ఉక్రెయిన్‌కు సాయం తగ్గుతోందా?

దాదాపు రెండేళ్లుగా సాగుతోన్న యుద్ధంతో ఉక్రెయిన్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. రష్యా దాడి చేసిన మొదట్లో ఉక్రెయిన్‌కు విదేశీ సాయం వెల్లువెత్తింది. అయితే.. ఎడతెగని యుద్ధం కారణంగా క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీంతో నిధుల కోసం ఎదురు చూస్తున్న కీవ్‌కు ఈయూ తాజా నిర్ణయంతో ఎట్టకేలకు ఉపశమనం లభించినట్లయ్యింది. ఐరోపా సహాయ ప్యాకేజీపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హర్షం వ్యక్తం చేశారు. ఈయూ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ఆన్‌లైన్‌ వేదికగా ప్రసంగిస్తూ.. మిలిటరీ సాయానికి ఇది ఏమాత్రం తీసిపోదన్నారు.

అది అమెరికా క్షిపణుల పనే.. రష్యా ఆరోపణ

గత నెలలో ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో కూలిపోయిన తమ సైనిక రవాణా విమానాన్ని కీవ్‌ బలగాలే అమెరికాకు చెందిన ‘పేట్రియట్‌’ గగనతల రక్షణవ్యవస్థను ఉపయోగించి కూల్చేసినట్లు రష్యా ఆరోపించింది. తమ విచారణ కమిటీ నివేదికలో ఈ విషయం వెల్లడైందని తెలిపింది. ఖర్కివ్‌ రీజియన్‌ నుంచి విమానంపైకి రెండు క్షిపణులను ప్రయోగించినట్లు పేర్కొంది. అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు బయటపెట్టలేదు. ఈ దాడిలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు, తొమ్మిది మంది విమాన సిబ్బంది, ముగ్గురు రష్యా భద్రతాసిబ్బంది మృతి చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు