Russia-Ukarine: రష్యాతో యుద్ధం.. ఉక్రెయిన్‌కు సాయం తగ్గుతోందా?

రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు ఆర్థికంగా అండగా నిలబడిన దేశాలు క్రమంగా తగ్గుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది.

Published : 07 Dec 2023 21:29 IST

కీవ్‌: రష్యా- ఉక్రెయిన్‌ (Russia-Ukrarine War) యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నా పరిస్థితులు సద్దుమణగడం లేదు. కొన్నాళ్లపాటు దాడులు చేయకుండా స్తబ్దుగా ఉన్న రష్యా.. ఇటీవల కాలంలో మళ్లీ తీవ్రతరం చేస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో ఉక్రెయిన్‌కు అన్ని రకాలుగా అండగా నిలబడిన పాశ్చాత్య దేశాలు ప్రస్తుతం అంతగా ఆసక్తి చూడపడం లేదని తాజా అధ్యయనంలో తేలింది. యుద్ధానికి ముందు ఆర్థికంగా అండగా నిలిచిన దేశాలు ప్రస్తుతం ముఖం చాటేస్తున్నాయని జర్మనీకి చెందిన కెయిల్‌ ఇన్‌స్టిట్యూట్‌ తన పరిశోధనలో గుర్తించింది. ఉక్రెయిన్‌ మద్దతుదారులు తగ్గిపోయారని, యుద్ధానికి ముందు ఆ దేశానికి రక్షణ రంగంతోపాటు ఆర్థికంగా సాయం చేసిన దేశాలు క్రమంగా తమ మాటను వెనక్కి తీసుకుంటున్నాయని చెప్పింది.

ఫిబ్రవరి, 2022లో రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. రష్యా దాడి చేసిన మొదట్లో ఆన్‌లైన్‌లో విరాళాలు వెల్లువెత్తాయి. ఉక్రెయిన్‌ ఆయుధాలు కొనడానికి ఈ నిధులు ఎంతో అక్కరకొచ్చాయి. యుద్ధం ఎడతెగకుండా సాగడంతో క్రమంగా విరాళాలు తగ్గుతూ వస్తున్నాయి. అగస్టు 2022 నుంచి అక్టోబర్‌ 2022 మధ్య కాలంలో ఉక్రెయిన్‌ పొందిన విదేశీ సాయాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది అదే మూడు నెలల వ్యవధిలో ఆ దేశం పొందిన సాయం 87శాతం మేర తగ్గింది. యుద్ధం మొదలైన తర్వాత ఓ త్రైమాసికంలో అత్యంత తక్కువ మొత్తంలో సాయం రావడం ఇదే తొలిసారి. దీనికి వివిధ కారణాలు ఉండొచ్చని కెయిల్ ఇన్‌స్టిట్యూట్ అభిప్రాయపడింది.

ఆత్మహత్యా..? చిత్రహింసలు పెట్టి చంపేశారా..?: అదృశ్యమైన చైనా నేతపై కథనాలు

పాశ్చాత్య దేశాలతో ఉక్రెయిన్‌ సంబంధాలు కాస్త బలహీన పడటం కూడా నిధుల లేమికి కారణం కావొచ్చని అధ్యయనం పేర్కొంది.. ఉక్రెయిన్‌ నుంచి రష్యాను తరిమేస్తామంటూ జూన్‌ 2023లో మొదలుపెట్టిన ఎదురుదాడి నత్తనడకగా సాగుతోంది. ఆక్రమిత స్థలాల నుంచి రష్యన్లను పారదోలడంలో ఉక్రెయిన్‌ విఫలమైంది. తాము అధికారంలోకి వస్తే ఉక్రెయిన్‌కు సాయానికి స్వస్తి చెబుతామని ప్రతిపక్ష రిపబ్లికన్లు బాహాటంగానే చెబుతున్నందున అమెరికా సహాయం అనిశ్చితిలో పడింది. ఐరోపా సమాఖ్యలోనూ (ఈయూ) రాజకీయ విభేదాలు తలెత్తడంతో ఉక్రెయిన్‌కు గతంలో హామీ ఇచ్చిన మేరకు ఆయుధాలను సరఫరా చేయడం లేదు. అంతేకాకుండా వచ్చే నాలుగేళ్లలో ఉక్రెయిన్‌కు 53 బిలియన్‌ యూరోల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిన ఈయూ.. ఆ నిధుల విడుదలలోనూ తాత్సారం చేస్తోంది.

కెయిల్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం... ఈ ఏడాది ఆగస్టు - అక్టోబర్‌  మధ్య కాలంలో ఉక్రెయిన్‌కు 2.11 బిలియన్‌ యూరోల ఆర్థిక సాయం లభించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే ఇది 87శాతం తక్కువ. గతంలో ఉక్రెయిన్‌కు ఆర్థికంగా మద్దతు తెలిపిన 40 దేశాల్లో.. ప్రస్తుతం కేవలం 20 దేశాలు మాత్రమే తమ సహకారాన్ని కొనసాగించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా సాయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ఈయూ ఆర్థిక సాయం కోసం ఉక్రెయిన్‌ ఎదురు చూస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని