Google: గూగుల్‌ ఏఐ సీక్రెట్లు దోచి చైనాలో స్టార్టప్‌.. మాజీ ఇంజినీర్‌ అరెస్ట్‌

Google: చైనా కంపెనీలతో కలిసి పనిచేస్తూ గూగుల్‌ ఏఐ సాంకేతికతను దొంగలించిన కేసులో మాజీ ఇంజినీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై నేరాభియోగాలు నమోదు చేశారు. 

Updated : 07 Mar 2024 11:13 IST

వాషింగ్టన్‌: చైనా (China)కు చెందిన ఓ ఉద్యోగి గూగుల్‌ (Google)లో ఉద్యోగం చేస్తూనే.. తన స్వదేశంలోని కంపెనీతో రహస్యంగా పనిచేశాడు. అంతేనా.. గూగుల్‌ కృత్రిమ మేధ (Artificial Intelligence) సాంకేతికతను దొంగలించి.. వాటి సాయంతో చైనాలో ఏకంగా కంపెనీనే ప్రారంభించాడు. చివరకు అతడి నిర్వాకం బయటపడి పోలీసులకు చిక్కాడు.

చైనాకు చెందిన లిన్‌వీ డింగ్‌ను గూగుల్‌ 2019లో నియమించుకుంది. నాటి నుంచి కాలిఫోర్నియాలోని సంస్థ కార్యాలయంలో పనిచేస్తూ అతడు.. రెండేళ్ల క్రితం నుంచి అక్రమాలు మొదలుపెట్టాడు. కంపెనీకి చెందిన సూపర్‌కంప్యూటింగ్‌ డేటా సెంటర్లల రహస్యాలను సేకరించాడు. ఆ వివరాలతో ఉన్న వందల కొద్దీ ఫైళ్లను తన వ్యక్తిగత గూగుల్‌ క్లౌడ్‌ అకౌంట్‌లో అప్‌లోడ్‌ చేశాడు.

రష్యా చెస్‌ దిగ్గజం కాస్పరోవ్‌ టెర్రరిస్టా..!

ఈ చోరీలు మొదలుపెట్టిన కొన్ని వారాలకే చైనాలో ఓ స్టార్టప్‌ టెక్నాలజీ కంపెనీ అతడిని చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా నియమించుకుంది. గూగుల్‌లో పనిచేస్తూనే డింగ్‌.. చైనా కంపెనీలో ఉన్నత హోదాలో విధులు నిర్వర్తించాడు. ఆ సంస్థ ఇన్వెస్టర్ల సమావేశాలకు హాజరయ్యాడు. అంతేగాక, తన స్వదేశంలో సూపర్‌కంప్యూటింగ్‌ చిప్‌లతో ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చే ఓ స్టార్టప్‌ సంస్థను కూడా సొంతంగా ప్రారంభించాడు.

దాదాపు రెండేళ్ల పాటు అతడు అమెరికాలో ఉద్యోగం చేస్తూనే చైనా కంపెనీలకు పనిచేశాడు. చివరకు విషయం బయటపడటంతో గతేడాది డిసెంబరులో గూగుల్‌కు రాజీనామా చేశాడు. అనంతరం గూగుల్‌ అంతర్గత దర్యాప్తు చేపట్టగా.. డింగ్‌ కంపెనీకి చెందిన కీలక ఏఐ సమాచారాన్ని దొంగలించినట్లు తెలిసింది. దీంతో అతడిపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. డింగ్‌పై నాలుగు కౌంట్ల నేరాభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో అతడికి ఒక్కో కౌంట్‌కు 10 ఏళ్ల చొప్పున జైలు శిక్షపడే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు