Garry Kasparov: రష్యా చెస్‌ దిగ్గజం కాస్పరోవ్‌ టెర్రరిస్టా..!

చెస్ మాజీ ప్రపంచ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్‌ (Garry Kasparov)ను రష్యా ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 

Published : 07 Mar 2024 10:31 IST

మాస్కో: రష్యాలో అధ్యక్షుడు పుతిన్‌ విమర్శకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సిందే. వారిపై  ఆంక్షలు, ప్రాణాంతక దాడులు కోకొల్లలు. తాజాగా చెస్‌ లెజెండ్‌ గ్యారీ కాస్పరోవ్‌ (Garry Kasparov)పై ఆ దేశం కఠిన చర్యలు తీసుకుంది. ఆయన్ను ‘ఉగ్రవాదులు, అతివాదులు’ జాబితాలో చేర్చింది. ఈ విషయాన్ని స్థానికమీడియా సంస్థ వెల్లడించింది.

60 ఏళ్ల కాస్పరోవ్‌ (Garry Kasparov) చదరంగంలో అనేకమార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. ఆయన రాజకీయంగా తన అభిప్రాయాలను బలంగా వినిపిస్తుంటారు. పుతిన్‌ విధానాలను ఎండగడుతుంటారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను పలుమార్లు ఖండించారు. ఈ నేపథ్యంలో రోస్‌ఫిన్‌మానిటరింగ్‌ (రష్యా ఆర్థిక పర్యవేక్షణా సంస్థ) కొద్ది గంటల క్రితం కొత్తగా ఉగ్రవాదుల జాబితాను విడుదల చేసింది. దానిలో గ్యారీ కాస్పరోవ్‌ పేరును చేర్చింది. అందుకు దారితీసిన కారణాలను మాత్రం వివరించలేదు.  

అలెగ్జాండర్‌ నుంచి నావల్నీ దాకా.. అంతుచిక్కని పుతిన్‌ విమర్శకుల మరణాలు

ఈ జాబితాలోని వ్యక్తుల బ్యాంకు లావాదేవీలపై ఆంక్షలు ఉంటాయి. వారి ఖాతాలను ఉపయోగించాలనుకున్న ప్రతిసారి అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అణచివేతకు భయపడి 2014లోనే ఆయన దేశం విడిచివెళ్లిపోయారు. దశాబ్దకాలంగా అమెరికాలో ఉంటున్నారు. 2022లో రష్యా న్యాయశాఖ ఆయనపై విదేశీ ఏజెంట్‌ అనే ముద్ర వేసింది. 

కాస్పరోవ్‌పై తీసుకున్న చర్యలను హక్కుల సంఘాలు ఖండిస్తున్నాయి. ప్రత్యర్థుల అణచివేతకు ఈ ఆంక్షలను ఆయుధంగా ఉపయోగిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలాఉంటే.. ఇటీవల ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మరణం పలు అనుమానాలను తావిచ్చిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని