Indra Nooyi: అమెరికాలో వరుస ఘటనలు.. భారత విద్యార్థులకు ఇంద్రానూయీ సూచనలు

అమెరికా (USA)లో ఉన్న భారత విద్యార్థులకు పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీ(Indra Nooyi) పలు సూచనలు చేశారు.

Updated : 22 Mar 2024 15:05 IST

ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా(USA)లో వెలుగుచూస్తున్న భారతీయ, భారత మూలాలున్న విద్యార్థుల మరణాలు, అదృశ్యం ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిపై పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రానూయీ(Indra Nooyi) స్పందించారు. స్థానిక చట్టాలను గౌరవిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియోను న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్టు చేసింది.

‘‘ఇటీవల కొందరు విద్యార్థులు ఎదుర్కొన్న దురదృష్టకర పరిస్థితుల గురించి విన్నాను. అందుకే మీతో మాట్లాడేందుకు ఈ వీడియో రికార్డు చేశాను. ఈ పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. చట్టానికి లోబడి ఉండండి. రాత్రి పూట చీకటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లకండి. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి. దయచేసి అతిగా మద్యం సేవించకండి. ఇవన్నీ విపత్తుకు దారితీసే అంశాలు. కుటుంబాలకు దూరంగా అమెరికాకు వచ్చిన కొత్తల్లో స్నేహితులు, కొత్త అలవాట్ల వంటివాటిపై జాగ్రత్తగా ఉండండి. 

అమెరికాలో హైదరాబాద్‌ విద్యార్థి అదృశ్యం.. కుటుంబానికి బెదిరింపు కాల్‌..!

భారతీయ విద్యార్థులు కఠోర శ్రమ, విజయానికి చిరునామాలు. అదే సమయంలో కొందరు ఫెంటానెల్‌ వంటి డ్రగ్స్‌కు బానిసలవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అవి ప్రాణాంతకం. మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు కెరీర్‌ అవకాశాలను దెబ్బతీస్తాయి. అలాగే మీ వీసా స్టేటస్‌ గురించి తెలుసుకోవాలి. పార్ట్‌టైం ఉద్యోగం విషయంలో దానికున్న చట్టబద్ధతను అర్థం చేసుకోవాలి. అమెరికాలో విదేశీ విద్యార్థిగా మీకున్న హద్దులు తప్పక తెలుసుకోవాలి’’ అని ఇంద్రానూయీ(Indra Nooyi) సూచించారు. విద్యాసంస్థల పట్ల అవగాహనతో ఉండాలని, స్కామ్‌లు, సోషల్‌ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 

తాజాగా అమెరికాలో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌ మహమ్మద్‌ అనే విద్యార్థి మార్చి 7వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. తమకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చిందని అబ్దుల్‌ తండ్రి మహమ్మద్‌ సలీం పేర్కొన్నారు. అడిగిన మొత్తం ఇవ్వకపోతే కుమారుడి కిడ్నీ విక్రయిస్తామని హెచ్చరించినట్లు చెప్పారు. కొద్దివారాల క్రితం వివేక్‌ సైనీ అనే విద్యార్థి నిరాశ్రయుడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. అంతేగాకుండా కొందరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని