White House: పుతిన్‌, జిన్‌పింగ్‌ ఆలింగనంపై.. వైట్‌హౌస్‌ జోకులు

చైనా పర్యటన చేపట్టిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. ఆ దేశాధినేత జిన్‌పింగ్‌ను ఆలింగనం చేసుకోవడంపై వైట్‌హౌస్‌ వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది.

Published : 18 May 2024 17:27 IST

వాషింగ్టన్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ (Vladimir Putin) చైనా పర్యటనపై అమెరికా స్పందించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi Jinping)ను మర్యాదపూర్వకంగా కలిసిన పుతిన్‌ ఆయన్ను ఆలింగనం చేసుకోవడంపై వైట్‌హౌస్‌ వ్యంగ్యాస్ర్తాలు సంధించింది. ఇరునేతలు కౌగిలించుకున్నంత మాత్రాన ఆ దేశాల మధ్య సంబంధాల్లో పురోగతి సాధిస్తుందని అనిపించడం లేదని వైట్‌హౌస్‌ ప్రతినిధి జాన్ కిర్బీ ఎద్దేవా చేశారు.

‘‘ఆ దేశాధినేతలిద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారో, లేక ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు ఇలా చేశారో ఆ జెంటిల్‌మెన్లకే (పుతిన్‌, జిన్‌పింగ్‌లను ఉద్దేశిస్తూ) వదిలేస్తున్నా. దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేదు. కౌగిలించుకున్నంత మాత్రాన దేశాలు పురోగతి సాధించలేవు. అందుకే ఈ పర్యటన మాకు ఆశ్చర్యంగా అనిపించడం లేదు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, దీని ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి’’ అని కిర్బీ విమర్శలు గుప్పించారు. ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో రష్యాకు చైనా సాంకేతిక సాయం చేయడంపై అమెరికా మరోసారి ఆందోళన వ్యక్తంచేసింది.

విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్‌ పార్లమెంట్‌లో ఎంపీల కొట్లాట

కాగా.. ఇటీవల ఎన్నికల్లో ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన పుతిన్‌ చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇది. రష్యా, చైనాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 75 ఏళ్లైన సందర్భంగా జిన్‌పింగ్‌ ఆహ్వానం మేరకు పుతిన్‌ ఆ దేశాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. గత ఎనిమిది నెలల్లో రష్యా అధ్యక్షుడు చైనాను సందర్శించడం ఇది రెండోసారి. దీనిపై తాజాగా స్పందించిన వైట్‌హౌస్‌ ఈ వ్యాఖ్యలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని