Taiwan: విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్‌ పార్లమెంట్‌లో ఎంపీల కొట్లాట

Taiwan: తైవాన్‌లో పార్లమెంట్ సభ్యులు విచక్షణ మరిచి పరస్పరం దాడికి దిగారు. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.

Published : 18 May 2024 11:17 IST

తైపీ: పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పరస్పర విమర్శలు.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విపక్షాల ఆందోళనలు తరచూ చూస్తునే ఉంటాం. ఇక సభ్యుల మధ్య వాగ్వాదం కూడా సరేసరి. అయితే అదంతా మర్యాదపూర్వకంగా ఉండాలి. అంతేగానీ, చట్టసభల హుందాను పెంచాల్సిన ప్రజాప్రతినిధులే విచక్షణ మరిచి ప్రవర్తిస్తే..! తైవాన్‌ పార్లమెంట్‌ (Taiwan Parliament)లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీలు (Lawmakers) పరస్పర దాడికి దిగారు. ఎత్తిపడేసి.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు.

పార్లమెంట్‌లో సంస్కరణలకు సంబంధించి శుక్రవారం సభలో ఓ బిల్లును ప్రతిపాదించారు. ఈ సందర్భంగా విపక్షాలు కొన్ని డిమాండ్లు చేశాయి. ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు ఎంపీలకు మరింత ఎక్కువ అధికారాలు ఉండాలని పట్టుబట్టాయి. పార్లమెంట్‌లో తప్పుడు ప్రకటనలు ఇచ్చే సభ్యులపై నేరాభియోగాలు మోపేలా బిల్లులో ప్రతిపాదనలు చేయడాన్ని వ్యతిరేకించాయి. ఈ బిల్లు ఓటింగ్‌కు రావడానికి ముందే ప్రజాప్రతినిధుల ఛాంబర్‌లో సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.

కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్‌

ఆ తర్వాత పార్లమెంట్‌లో దీనిపై చర్చ జరుపుతుండగా సభ్యులు మరోసారి గొడవకు దిగారు. అది కాస్త తీవ్రమై ఎంపీలు ఒకరినొకరు తోసుకున్నారు. కొందరు టేబుల్స్ పైనుంచి దూకి స్పీకర్‌ సీటు వద్దకు వెళ్లి చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. మరికొందరు తోటి సభ్యులను ఎత్తిపడేసి ముష్టిఘాతాలకు పాల్పడ్డారు. ఈ బిల్లు ఆమోదం పొందకుండా ఉండాలని ఓ సభ్యుడు దస్త్రాలను దొంగలించి సభ నుంచి బయటకు పరిగెత్తారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తైవాన్‌ మీడియాలో ప్రసారమయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.

మరికొద్ది రోజుల్లో తైవాన్‌లో నూతన అధ్యక్షుడి ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్న వేళ ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీకి చెందిన లాయ్‌ చింగ్‌ తే అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. సోమవారం (మే 20) ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని