Israel Hamas conflict: మహిళా సైనికులపై చిత్రహింసలు.. వెలుగులోకి హమాస్‌ ఉగ్రవాదుల క్రూరత్వం!

ఇజ్రాయెల్‌ పౌరులను బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు.. చిత్ర హింసలకు గురిచేసి ప్రాణాలు తీస్తున్నారు. ఈ క్రమంలో మహిళా సైనికులను సైతం చిత్రహింసలు పెట్టిన మరికొన్ని వీడియోలు తాజాగా బయటకు వచ్చాయి.

Published : 23 May 2024 14:45 IST

జెరూసలెం: గతేడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదులు చేసిన దాడి తీవ్ర యుద్ధానికి (Israel Hamas conflict) దారితీసింది. అనేకమంది ఇజ్రాయెల్‌ పౌరులను బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు.. వారిని చిత్ర హింసలకు గురిచేసి ప్రాణాలు తీస్తున్నారు. ఈ క్రమంలో ఐదుగురు మహిళా సైనికులను నిర్బంధించి, చిత్రహింసలు పెట్టిన మరికొన్ని వీడియోలు తాజాగా బయటకు వచ్చాయి. ఈ దారుణ పరిస్థితులకు సంబంధించిన వీడియోలను బాధిత కుటుంబాలు విడుదల చేసినట్లు సమాచారం. దీనిపై ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. హమాస్‌ అంతం తప్పదని మరోసారి హెచ్చరించారు.

హమాస్‌ ఉగ్రవాదులు మొత్తం 250 మందిని బందీలుగా చేసుకోగా.. అందులో ఏడుగురు మహిళా సైనికులు ఉన్నారు. వారిలో ఒకరిని గాజాలో గ్రౌండ్‌ ఆపరేషన్‌ సమయంలో ఇజ్రాయెల్‌ ఆర్మీ రక్షించింది. మరో మహిళ మాత్రం ఉగ్రవాదుల నిర్బంధంలోనే చనిపోయారు. తాజాగా ఐదుగురు ఉన్న వీడియో బయటకు వచ్చింది. తమ పిల్లలు కనిపించడంతో బాధిత కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. కానీ, వారు తీవ్ర గాయాలతో కనిపించడం కలచివేసింది. ముఖాలు తీవ్ర రక్తస్రావం కావడం, అందులో కొందరు నడవలేని స్థితిలో ఉన్నారు. చేతులు, కాళ్లు కట్టేసి లాక్కెళుతున్న దృశ్యాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తుపాకులతో శబ్దం చేస్తూ.. వారిని జీపులోకి ఎక్కిస్తున్నట్లు కనిపించడం సంబంధీకులను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది.

కొత్త అధ్యక్షుడి ప్రసంగం ఎఫెక్ట్‌.. తైవాన్‌కు చైనా ‘పనిష్మెంట్‌’..!

తాజా పరిణామాలపై ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు స్పందించారు. ఆ వీడియోలు తనను షాక్‌కు గురిచేశాయన్నారు. వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. వారి క్రూరత్వం చూస్తుంటే హమాస్‌ను అంతం చేయాలనే తన సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తోందన్నారు. అయితే, ఈ వీడియో ఎప్పటిది? వారు ఇంకా బందీలుగానే ఉన్నారా, లేదా? అనే విషయంపై స్పష్టత లేదు.

వీటిపై అటు హమాస్‌కు కూడా స్పందించింది. అటువంటి ఆపరేషన్‌ చేసినప్పుడు స్వల్పగాయాలు సహజమేనని వెల్లడించింది. వారిపై ఎటువంటి భౌతిక దాడికి పాల్పడలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో సమయం వృథా చేయొద్దని.. తక్షణమే హమాస్‌తో చర్చలు జరపాలని ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహును బాధిత కుటుంబాలు వేడుకున్నాయి. ఆలస్యం చేస్తే వారు బతికుండే అవకాశం తక్కువని ఆందోళన వ్యక్తంచేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు