Baltimore Incident: బాల్టిమోర్‌ వంతెన ఘటన.. రంగంలోకి ఎఫ్‌బీఐ!

అమెరికాలోని బాల్టిమోర్‌లో ఓ నౌక ఢీకొని వంతెన కూలిపోయిన ఘటనలో దర్యాప్తునకు ‘ఎఫ్‌బీఐ’ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

Published : 16 Apr 2024 00:06 IST

వాషింగ్టన్‌: గత నెలలో అమెరికా (USA)లోని బాల్టిమోర్‌లో నౌక (Dali) ఢీకొనడంతో ఓ వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ఈ వ్యవహారంలో తాజాగా ‘ఎఫ్‌బీఐ (FBI)’ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. నేర కోణంలో దర్యాప్తును ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, నౌక సిబ్బంది అన్ని నిబంధనలు పాటించారా? వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సంస్థ అధికారులు ఓడలోకి అడుగుపెట్టినట్లు ఎఫ్‌బీఐ సోమవారం వెల్లడించింది.

బాల్టిమోర్‌ వంతెన ఘటన.. ‘అమెరికా ఆర్థిక విపత్తు’

నౌక వ్యవస్థలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని తెలిసి కూడా అది ఓడరేవు నుంచి బయలుదేరిందా? అనే విషయాన్ని కూడా ఎఫ్‌బీఐ ఆరా తీయనున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అందులో 20 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. అయితే ప్రమాదానికి ముందే వారు అధికారులను అప్రమత్తం చేయడంతో వంతెనపై రాకపోకలను నిలిపేయగలిగారు. అమెరికా అధికారులు ఇప్పటికే వారిని విచారించారు. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) సైతం తమ దర్యాప్తులో భాగంగా ఓడలోని కీలకపత్రాలు, ఇతర ఆధారాలను సేకరించినట్లు నౌక నిర్వహణ సంస్థ సినర్జీ ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని