అఫ్గాన్‌లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!

Afghanistan: ఆఫ్గాన్‌లో వరద కారణంగా 68 మంది మరణించినట్లు తాలిబన్‌ అధికారులు తెలిపారు.

Published : 18 May 2024 22:15 IST

కాబుల్‌: భారీ వర్షాలతో అఫ్గానిస్థాన్‌ (Afghanistan) అతలాకుతలం అవుతోంది. స్థానికంగా మెరుపు వరదలు (Flash Floods) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వరదల్లో చిక్కుకొని దాదాపు 68 మంది మృతిచెందినట్లు తాలిబన్‌ అధికారులు వెల్లడించారు.

పశ్చిమ ప్రావిన్స్‌ ఘోర్‌లో వరద పోటెత్తడంతో.. 50 మంది ప్రాణాలు కోల్పోయారని గవర్నర్‌ అధికార ప్రతినిధి తెలిపారు. రాజధాని సహా పలు ప్రాంతాల్లో వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయని, దీంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లిందన్నారు. వేల ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఉత్తర ప్రావిన్స్‌ ఫరయాబ్‌లోనూ 18 మంది మరణించగా.. మరో ఇద్దరు గాయపడినట్లు వెల్లడించారు.

పుతిన్‌, జిన్‌పింగ్‌ ఆలింగనంపై.. వైట్‌హౌస్‌ జోకులు

వరదల కారణంగా ఘోర్‌ ప్రావిన్స్‌లో పరిస్థితులు దారుణంగా మారాయని, 2500కుపైగా కుటుంబాలు ప్రభావితమయ్యాయని ఐరాస ఆహార సంస్థ (డబ్ల్యూఎఫ్‌పీ) ‘ఎక్స్‌’ వేదికగా తెలిపింది. వారం రోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాల ధాటికి 300 మందికిపైగా మరణించారని వెల్లడించింది. ప్రాణాలతో బయటపడిన వారికి ఆశ్రయం కరవైందని పేర్కొంది. బగ్లాన్‌లో కొన్ని ప్రాంతాలకు ట్రక్కుల ద్వారా చేరుకోలేని పరిస్థితి ఉందని.. వారికి ఆహారం అందించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని