నాన్న ప్రేమగా ఉండడు.. అమ్మ నాతో ఆడుకోదు.. నాలుగేళ్ల చిన్నారి ఆవేదన

నాన్న ప్రేమగా ఉండడు.. అమ్మ నాతో ఆడుకోదు అంటూ ఓ నాలుగేళ్ల చిన్నారి చెబుతున్న మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Published : 02 Dec 2023 02:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత యాంత్రిక జీవనంలో కాలంతోపాటు మనిషి పరిగెత్తాల్సిందే. ఉద్యోగం చేసే తల్లిదండ్రులైతే ఉదయం బయటికెళితే.. తిరిగి ఇంటికి చేరుకునే సరికి రాత్రవుతుంది. ఇందుకు కారణాలు ఏవైనా.. ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో గడిపే సమయం తగ్గిపోతుందనేది వాస్తవం. దీంతో చాలా మంది పిల్లలు తమపై తల్లిదండ్రులకు ప్రేమ లేదనే భావనకు గురవుతున్నారట. ఇదే విషయమై ఓ చిన్నారి వ్యక్తం చేసిన ఆవేదనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

దక్షిణ కొరియా (South Korea)లో చిన్నారుల కోసం ‘మై గోల్డెన్ కిడ్స్’ అనే పాపులర్‌ టీవీ షో నిర్వహిస్తుంటారు. ఇందులో పాల్గొన్న సాంగ్‌ ఇయో జున్‌ (Song Eo Jun) అనే నాలుగేళ్ల పిల్లాడు.. ఇంట్లో తాను ఒంటరిగా ఉంటానని, తనతో ఎవరూ ఆడుకోరని చెబుతున్న మాటలు ప్రతి ఒక్కరి మనసుల్ని ద్రవింపచేస్తున్నాయి. అంతేకాకుండా వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నలకు సాంగ్‌ చెప్పే సమాధానాలు తల్లిదండ్రులపై అతనికున్న ఆలోచనను ప్రతిబింబిస్తున్నాయి. 

ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యన్ మహిళలకు పుతిన్ విజ్ఞప్తి

సాంగ్‌ తండ్రి గురించి చెబుతూ.. ‘‘నాన్న కోపంతో ఉన్నప్పుడు నాకు భయమేస్తుంది. ఆయన నాతో ప్రేమగా మాట్లాడితే బాగుంటుంది’’ అని అన్నాడు. అలాగే, అమ్మకు తానంటే ఇష్టం లేదని, తనతో ఎప్పుడూ ఆడుకోదని.. కన్నీళ్లను బిగపట్టి చెబుతున్న మాటలు షోలో ఉన్నవారితోపాటు వీడియో చూస్తున్న వారిని ఆలోచింప చేస్తున్నాయి. దాంతోపాటు అమ్మ.. తనతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్లు సాంగ్‌ చెప్పాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ప్రస్తుత సమాజంలో చాలా మంది పిల్లలు సాంగ్ పరిస్థితినే ఎదుర్కొంటున్నారని కామెంట్లు చేస్తున్నారు. సాంగ్ చెబుతున్న మాటలు చూసి అతని తల్లిదండ్రులు ఇకపై ప్రేమగా ఉంటామని, ఎక్కువ సమయం గడుపుతామని చెప్పినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని