Vladimir Putin: ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యన్ మహిళలకు పుతిన్ విజ్ఞప్తి

రాబోయే రోజుల్లో రష్యా జనాభాను పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని దేశ మహిళలను అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ విజ్ఞప్తి చేశారు.

Updated : 01 Dec 2023 18:58 IST

మాస్కో: రష్యా (Russia) మహిళలకు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలోని మహిళలు ఎనిమిది అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కని, పెద్ద కుటుంబాలుగా విస్తరించాలని కోరారు. కొద్దిరోజుల క్రితం రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ‘వరల్డ్‌ రష్యన్‌ పీపుల్’ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పుతిన్‌ మాట్లాడుతూ.. 1990 నుంచి రష్యాలో జననాల రేటు పడిపోయిందని, ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి సుమారు మూడు లక్షలకు పైగా ప్రాణనష్టం జరిగిందని తెలిపారు. రాబోయే రోజుల్లో రష్యా జనాభాను పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని దేశ మహిళలను కోరారు.

‘‘పాత తరంవారు నలుగురు, ఐదుగురు పిల్లల్ని కనడం వల్లనే మన సమాజం బలంగా ఉంది. మన అమ్మమ్మలు, నానమ్మలకు ఎనిమిది మంది పిల్లలు ఉండేవారనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సంప్రదాయాన్ని మనం కాపాడుకుందాం. పెద్ద కుటుంబాలుగా ఉండటం అనేది దేశంలో ప్రామాణికంగా మారాలి. కుటుంబం అనేది కేవలం సమాజానికి పునాది మాత్రమే కాదు.. ఆధ్యాత్మికతకు, నైతికతకు నిదర్శనం. భవిష్యత్తు తరాలు రష్యా జనాభాను పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇది ప్రపంచంలో రష్యాని బలోపేతం చేస్తుంది’’ అని పుతిన్‌ తెలిపారు. 

కైలాస దేశంతో ఒప్పందం.. పరాగ్వే మంత్రి పదవి ఊడగొట్టిన నిత్యానంద

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇరువైపులా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని బ్రిటన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల మంది సాధారణ పౌరులు దేశం వీడి ఉంటారని ‘రష్యా పాలసీ గ్రూప్‌’ తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా పలు పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా రష్యా తీవ్రమైన కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి కారణమవుతోందని అంతర్జాతీయ ఆర్థిక రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని