USA: పార్కింగ్‌లో ఉన్న విమానాన్నే విసిరికొట్టేంత గాలి..!

అమెరికాలోని టెక్సాస్‌లో అత్యంత శక్తిమంతమైన గాలులు వీచాయి. వీటి దెబ్బకు ఓ బోయింగ్‌ విమానమే ఆట బొమ్మలా కదిలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Published : 29 May 2024 15:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  అమెరికా(USA)లోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను శక్తిమంతమైన టోర్నడోలు కుదిపేశాయి. వీటి బీభత్సానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. డల్లాస్‌ ఫోర్ట్‌ వర్త్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఓ బోయింగ్‌  737-800 విమానమే ఈ గాలి దెబ్బకు కదిలిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ అందులో లేరు. విమానాశ్రయ నిఘా కెమెరాల్లో ఈ దృశ్యం నిక్షిప్తమైంది.  మంగళవారం ఉదయం ఎయిర్‌పోర్టులో గేట్‌ సీ21 వద్ద ఈ ఘటన చోటుచేసుకొంది. ఆ సమయంలో దాదాపు గంటకు 80 మైళ్ల వేగంతో గాలులు వీచాయి. ఈ దెబ్బకు దాదాపు 202 విమానాలను రద్దు చేయగా.. మరో 500 విమాన సర్వీసుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. 

ఇక ఈ తుపాను కారణంగా  టెక్సాస్‌లో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. బేస్‌బాల్‌ సైజు వడగళ్లు పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇటీవల వచ్చిన వర్షాలతో భారీగా ఆస్తినష్టం సంభవించింది. దాదాపు 10 లక్షల కుటుంబాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఇప్పటివరకు టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌, మిస్సోరీ, కెంటకీ, ఉత్తర కరోలీనా, వర్జీనియా రాష్ట్రాల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 

హూస్టన్‌ ప్రాంతంలో వచ్చిన వరదల్లో భారీ సంఖ్యలో కార్లు కొట్టుకుపోయాయి. మూడు లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. నిర్మాణంలో ఉన్న ఇల్లు కూలి 16 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఇక తమ రాష్ట్రంలో ఐదుగురు చనిపోయినట్లు కెంటకీ గవర్నర్‌ ఆండీ బెషెర్‌ వెల్లడించారు. ఇక్కడ ఏడు లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఇటీవల కాలంలో టెక్సాస్‌ వంటి చోట్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికితోడు గాల్లో తేమ కూడా ఎక్కువగా ఉండటం ఈ పరిస్థితికి కారణమని అంచనా వేస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని