China: జపాన్‌పై నిషేధం తొలగించండి.. రంగంలోకి జీ-7 దేశాలు..!

జపాన్‌ సముద్ర ఉత్పత్తులపై నిషేధం తొలగించాలని జీ-7 దేశాలు పరోక్షంగా చైనాను అభ్యర్థించాయి. ఈ మేరకు 10 పేజీల ప్రకటన విడుదల చేశాయి.  

Published : 29 Oct 2023 15:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జపాన్‌ ఆహార దిగుమతులపై ఉన్న నిషేధాన్ని తక్షణమే ఎత్తేయాలని జీ-7 దేశాలు పరోక్షంగా చైనాను అభ్యర్థించాయి. ఫుకుషిమా దైచీ అణు విద్యుత్‌ కేంద్రం అణు విద్యుత్తు కేంద్రం నుంచి వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేయడం మొదలుపెట్టడం చైనా-జపాన్‌ మధ్య విభేదాలకు కారణంగా నిలిచింది. ఈ క్రమంలో జపాన్‌ నుంచి చేపల దిగుమతిని బీజింగ్‌ నిషేధించింది.  

తాజాగా ఒసాకలో జీ-7 వాణిజ్య మంత్రుల సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా పేరు ప్రస్తావించకుండానే చైనా వాణిజ్యాన్ని ఆయుధంగా వాడటాన్ని సభ్య దేశాలు తప్పుపట్టాయి. ‘‘వాణిజ్యపరంగా ఆధారపడటాన్ని ఆయుధం వలే వాడుకోవడాన్ని మేము ఖండిస్తున్నాం. స్వేచ్ఛా, పారదర్శక, పరస్పర ప్రయోజనకర ఆర్థికబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాము’’ అని దాదాపు 10 పేజీల ప్రకటనను విడుదల చేశాయి. కీలక సరఫరాల కోసం ఓ దేశంపై ఆధారపడటాన్ని తగ్గించడమనేది నిజమైన అవసరమని పేర్కొన్నారు. తాము విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థలను నిర్మించడానికి కట్టుబడి ఉన్నామని జపాన్‌ ఆర్థిక మంత్రి యసుతోషి నిషుమురా పేర్కొన్నారు. ముఖ్యంగా కీలక మైన ఖనిజాలు, చిప్స్, బ్యాటరీలు సరఫరా చేసే వ్యవస్థలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. 

పశ్చిమాసియాలో పరిస్థితులపై మోదీ ఆరా.. ఈజిప్టు అధ్యక్షుడితో చర్చలు

జపాన్‌ చేపలపై చైనా రెండు నెలల క్రితం గంపగుత్తగా నిషేధం విధించింది. జపాన్‌ జలాల్లో రేడియో ధార్మిక పదార్థాలను కలుపుతుందన్న ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకొంది. దక్షిణ కొరియా కూడా ఇదే బాటలో పయనించింది. అయితే ఇవన్నీ కేవలం భయాలు మాత్రమే అని జపాన్‌ కొట్టిపారేసింది. వీటిని పోగొట్టేందుకు అణు వ్యర్థ జలాలను విడుదల చేసిన ఫుకుషిమా తీరంలో పట్టిన చేపను జపాన్‌ ప్రధాని ఫ్యుమియో కిషిదా స్వయంగా తిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను జపాన్‌ ప్రధాని కార్యాలయం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అందులో కిషిదాతో పాటు మరో ముగ్గురు అధికారులు ఫుకుషిమా చేపలను ఆరగిస్తూకన్పించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని