బ్యూటీషియన్లకు అండాశయ క్యాన్సర్‌ ముప్పు

దీర్ఘకాలంగా హెయిర్‌ డ్రెస్సర్లు, బ్యూటీషియన్లుగా పనిచేసే మహిళలకు అండాశయ క్యాన్సర్‌ ముప్పు ఎక్కువని తాజా అధ్యయనం పేర్కొంది.

Published : 24 Jul 2023 04:12 IST

వాషింగ్టన్‌: దీర్ఘకాలంగా హెయిర్‌ డ్రెస్సర్లు, బ్యూటీషియన్లుగా పనిచేసే మహిళలకు అండాశయ క్యాన్సర్‌ ముప్పు ఎక్కువని తాజా అధ్యయనం పేర్కొంది. సేల్స్‌, రిటైల్‌, వస్త్ర తయారీ, నిర్మాణ రంగ పరిశ్రమల్లో పనిచేసేవారికి కూడా ఎంతోకొంత ముప్పు ఉందని తెలిపింది. సౌందర్యాన్ని మెరుగుపరిచేందుకు వాడే కొన్ని పదార్థాలు ఈ రకం క్యాన్సర్‌కు అతివలను చేరువ చేస్తాయని వెల్లడైంది. 29 రకాల రసాయనాల తాకిడికి గురికావడానికి అండాశయ క్యాన్సర్‌ ముప్పునకు మధ్య ఉన్న సంబంధాన్ని ఈ పరిశోధనలో విశ్లేషించారు.
కెనడాలోని మాంట్రియల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు 1,388 మంది మహిళలపై అధ్యయనం చేశారు. వీరి వయసు 18-79 ఏళ్ల మధ్య ఉంది. వీరిలో 491 మందికి అండాశయ క్యాన్సర్‌ ఉంది. పరిశోధనలో వెల్లడైన అంశాలివీ.-  హెయిర్‌ డ్రెస్సర్లు, క్షురకులు, బ్యూటీషియన్లుగా 10 ఏళ్లకుపైగా పనిచేసిన మహిళలకు అండాశయ క్యాన్సర్‌ ముప్పు మూడింతలు ఎక్కువ. వీరు 13 రకాల రసాయనాలకు ఎక్కువగా గురవుతుంటారు.

దశాబ్దానికిపైగా నిర్మాణ రంగంలో ఉన్న అతివలకు ఆ ముప్పు మూడింతలు అధికం.

ఎంబ్రాయిడరీ సహా వస్త్ర పరిశ్రమలో దీర్ఘకాలం పాటు పనిచేసినవారికి ఈ వ్యాధి ముప్పు 85 శాతం ఎక్కువ. అలాగే సేల్స్‌ రంగంలోని వారికి 45 శాతం, రిటైల్‌ రంగంలోనివారికి ఈ క్యాన్సర్‌ వచ్చే అవకాశం 59 శాతం ఎక్కువ.

 టాల్కం పౌడర్‌, అమోనియా, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, హెయిర్‌ డస్ట్‌, సింథటిక్‌ ఫైబర్లు, అద్దకాలు, రంగులు, సెల్యులోజ్‌, ఫార్మాల్డిహైడ్‌, ప్రొపెల్లెంట్‌ గ్యాస్‌లు; పెట్రోలు, బ్లీచ్‌ల్లో సహజసిద్ధంగా లభించే రసాయనాలతో 8 ఏళ్లకుపైబడి పనిచేస్తున్నవారికి 40 శాతం ముప్పు అధికం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని