Arthritis: వేగంగా విస్తరిస్తున్న కీళ్లవాతం!

ప్రస్తుతం 30 ఏళ్లు, అంతకు పైబడినవారిలో 15 శాతం మంది ఆస్టియో ఆర్థరైటిస్‌ (కీళ్లనొప్పులు)తో బాధపడుతున్నారని, 2025 నాటికి ప్రపంచ జనాభాలో 100 కోట్లమంది ఈ వ్యాధి బారినపడతారని అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ సంస్థ పరిశోధకులు హెచ్చరించారు.

Published : 25 Aug 2023 08:57 IST

దిల్లీ: ప్రస్తుతం 30 ఏళ్లు, అంతకు పైబడినవారిలో 15 శాతం మంది ఆస్టియో ఆర్థరైటిస్‌ (కీళ్లనొప్పులు)తో బాధపడుతున్నారని, 2025 నాటికి ప్రపంచ జనాభాలో 100 కోట్లమంది ఈ వ్యాధి బారినపడతారని అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ సంస్థ పరిశోధకులు హెచ్చరించారు. 1990-2020 మధ్య 30 ఏళ్ల కాలంలో 200 దేశాల్లో కీళ్లవాత బాధితుల సమాచారాన్ని విశ్లేషించి వీరు వెలువరించిన అధ్యయనం లాన్సెట్‌ పత్రికలో ప్రచురితమైంది. వయసు మీరడం, జనాభా పెరుగుదల, స్థూలకాయం వల్లనే కీళ్లవాత బాధితుల సంఖ్య పెచ్చరిల్లనున్నదని అధ్యయనకర్తలు వివరించారు. 1990లో ప్రపంచవ్యాప్తంగా 25.6 కోట్లమంది ఆస్టియో ఆర్థరైటిస్‌ బాధితులు ఉండగా, 2020కల్లా వారి సంఖ్య 59.5 కోట్లకు పెరిగింది. 2050కల్లా ఈ సంఖ్య 100 కోట్లకు పెరగవచ్చని అంచనా. ప్రస్తుతం ఆస్టియో ఆర్థరైటిస్‌ను పూర్తిగా నయం చేయలేకపోతున్నాం కాబట్టి వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాధి వచ్చిన వెంటనే తగు చికిత్సలు పొందడం, అల్పాదాయ-మధ్యాదాయ దేశాల్లో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను జనానికి అందుబాటు ధరలకు అందించడం ముఖ్యమని పరిశోధకులు సూచించారు. 2020నాటికి ఆస్టియో ఆర్థరైటిస్‌ బాధితుల్లో 61 శాతంమంది మహిళలే. స్త్రీపురుషుల శరీర నిర్మాణంలోని తేడా, హార్మోన్లు, జన్యుపరమైన కారణాల వల్లనే పురుషులకన్నా స్త్రీలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. స్థూలకాయాన్ని తగ్గిస్తే వ్యాధిని చాలావరకు నివారించవచ్చని పరిశోధకులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని