విధేయత ప్రకటిస్తారా.. జైల్లోకి వెళతారా!

నాయకుడు లేని వాగ్నర్‌ ముఠాను తన గుప్పిట్లోకి తెచ్చుకొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పావులు కదపడం ప్రారంభించారు. ఈ మేరకు శుక్రవారం ఒక డిక్రీపై సంతకం చేశారు. దీని ప్రకారం..

Published : 27 Aug 2023 05:00 IST

వాగ్నర్‌ గ్రూపు కిరాయి సైనికులకు పుతిన్‌ హెచ్చరిక

మాస్కో: నాయకుడు లేని వాగ్నర్‌ ముఠాను తన గుప్పిట్లోకి తెచ్చుకొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పావులు కదపడం ప్రారంభించారు. ఈ మేరకు శుక్రవారం ఒక డిక్రీపై సంతకం చేశారు. దీని ప్రకారం.. ఉక్రెయిన్‌ ప్రత్యేక సైనిక చర్యలో పాలుపంచుకుంటున్న వాగ్నర్‌ కిరాయి సైనికులంతా.. రష్యాకు విధేయంగా ఉంటామని సంతకం చేయాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాసిక్యూషన్‌ ఎదుర్కొనే ప్రమాదం ఉంది. జైల్లోకి వెళ్లే అవకాశమూ ఉంది. వాగ్నర్‌ గ్రూపు అధినేత ప్రిగోజిన్‌ ప్రయాణిస్తున్న విమానం కూలిన రెండు రోజులకే పుతిన్‌.. ఈ డిక్రీ జారీ చేయడం గమనార్హం. దీంతో ఈ కిరాయి సైనిక ముఠాను పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకోవడమే రష్యా అధ్యక్షుడి లక్ష్యంగా కనబడుతోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. పుతిన్‌ ఆదేశాలను ప్రిగోజిన్‌ శిరసావహించినా.. కొన్ని సందర్భాల్లో స్వతంత్రంగానే వ్యవహరించారు. రష్యా సైన్యంలోకి చేరాల్సిందిగా గతంలో పుతిన్‌ చేసిన ప్రకటనను లెక్క చేయలేదు. తన గ్రూపులో ఉన్నవారెవ్వరూ సంతకాలు చేయరని బహిరంగంగానే ప్రిగోజిన్‌ ప్రకటించారు. అనంతరం రష్యా సైన్యంలో కొందరు అసమర్థ అధికారులపై ఆగ్రహం ప్రకటిస్తూ.. ఏకంగా మాస్కోపైనే తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో ప్రిగోజిన్‌ చర్యను పుతిన్‌ దేశద్రోహంగా, వెన్నుపోటుగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలు తలెత్తకుండా పుతిన్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని