దళాలను వెనక్కితీసుకుంటామన్న భారత్‌

ద్వీప దేశమైన మాల్దీవుల్లో మోహరించిన దళాలను వెనక్కి తీసుకునేందుకు భారత్‌ అంగీకరించినట్లు ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్‌ మయిజ్జు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాకు తెలియజేశారు.

Published : 05 Dec 2023 04:23 IST

మాల్దీవుల అధ్యక్షుడు మయిజ్జు వెల్లడి

మాలే: ద్వీప దేశమైన మాల్దీవుల్లో మోహరించిన దళాలను వెనక్కి తీసుకునేందుకు భారత్‌ అంగీకరించినట్లు ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్‌ మయిజ్జు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాకు తెలియజేశారు. దుబాయ్‌ వేదికగా పర్యావరణ సదస్సు కాప్‌-28 సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత్‌ ప్రధాని మోదీ, మయిజ్జు సమావేశం అయ్యారు.  అభివృద్ధి, ఆర్థిక తదితర అంశాలపై చర్చలు జరిపారు. ‘‘సదస్సులో భాగంగా ప్రధాని మోదీతో భేటీలో పలు అంశాలపై చర్చలు జరిపాం. అలాగే మా దేశంలో ఉన్న భారత దళాలను వెనక్కి తీసుకోవాలని మరోసారి కోరాం. దీనికి దిల్లీ ప్రభుత్వం అంగీకరించింది. అంతేకాకుండా అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించాం’’ అని మయిజ్జు పేర్కొన్నారు. మరోపక్క ప్రధాని మోదీ కూడా..మాల్దీవులు అధ్యక్షుడితో జరిపిన చర్చల వివరాలను ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. ‘‘అధ్యక్షుడు మయిజ్జుతో సమావేశం సందర్భంగా అభివృద్ధి సహకారం, ఆర్థిక సంబంధాలతో పాటు భారత్‌- మాల్దీవుల సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించాం’’ అని తెలిపారు. ఇదిలా ఉండగా.. భారత్‌కు చెందిన దాదాపు 70 మందితో కూడిన సైన్యం ప్రస్తుతం మాల్దీవుల్లో ఉంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని