పెట్రోలు, ఎరువుల ధరలపై రైతన్నలు భగ్గు

‘ఉక్రెయిన్‌, రష్యాల మధ్య యుద్ధం కారణంగా పెట్రోలు, ఎరువుల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగి, మా బతుకులు నాశనమయ్యాయి.

Updated : 02 Feb 2024 06:07 IST

బెల్జియంలో ఈయూ పార్లమెంట్‌ వద్దకు ట్రాక్టర్లతో తరలి వచ్చి నిరసనలు
పోలీసుల పైకి బాణసంచా

బ్రసెల్స్‌: ‘ఉక్రెయిన్‌, రష్యాల మధ్య యుద్ధం కారణంగా పెట్రోలు, ఎరువుల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగి, మా బతుకులు నాశనమయ్యాయి. వ్యవసాయం ముందుకు సాగడం లేదు. ధరల్ని తగ్గించేందుకు కృషి చేస్తారా... లేదా?’ అంటూ యూరోపియన్‌ యూనియన్‌ నేతలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తక్కువ ధరలకు భారీగా దిగుమతి చేసుకుంటున్న నాణ్యత లేని ఎరువుల వల్ల, వాతావరణంలో మార్పుల కారణంగా సంభవిస్తున్న వరదలు, కరవు పరిస్థితుల కారణంగా పంటలు నాశనమై తీవ్రంగా నష్టపోతున్నామని, తమను ఆదుకోవాలంటూ కొన్ని వారాలుగా బెల్జియం రైతులు సాగిస్తున్న ఆందోళనలు తీవ్రరూపు దాల్చాయి. రాజధాని బ్రసెల్స్‌లోని యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్‌ పరిసరాలకు గురువారం ఆందోళనకారులు ట్రాక్టర్లలో భారీ ఎత్తున తరలివచ్చారు. వారు కొన్నిచోట్ల ఎండు గడ్డి మూటలను తగలబెట్టడంతో దట్టమైన పొగలు అలముకున్నాయి. పోలీసులు జలఫిరంగులతో మంటల్ని ఆర్పుతూ, రైతుల్ని చెదరగొట్టారు. ఈయూ పార్లమెంట్‌ మెట్ల పక్కన ఉన్న చెట్టును ఓ ఆందోళనకారుడు కూల్చేందుకు ప్రయత్నిస్తుండగా అతడిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులు రెచ్చిపోయి పోలీసులపైకి బాణసంచా సామగ్రి, గుడ్లు, బీరు సీసాలను విసిరారు.

ఉక్రెయిన్‌కు 50 బిలియన్‌ యూరోలు

‘రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం అందించడంపైనే ఈయూ సమిట్‌లో నేతలు దృష్టిపెట్టారు. మా సమస్యల పరిష్కారానికీ చర్యలు చేపట్టాలి’ అని రైతులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు కొత్తగా మరో 50 బిలియన్‌ యూరోలను మద్దతు ప్యాకేజీగా ఇవ్వాలని ఈయూ నేతలు హడావుడిగా నిర్ణయించారు. రైతుల డిమాండ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని బెల్జియం ప్రధాని అలెగ్జాండర్‌ డి క్రూ సమావేశంలో ప్రస్తావించారు. 27 మంది నేతలు పాల్గొన్న ఈయూ సమిట్‌లో... రైతుల డిమాండ్లను నెరవేర్చే విషయమై నిర్దిష్ట నిర్ణయాలేమైనా తీసుకున్నారా? లేదా అనేది తెలియరాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని