క్వాడ్‌పై అమెరికా పునరాలోచనలో పడ్డ వేళ..

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దుందుడుకుతనానికి కళ్లెం వేసేందుకు భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా కలిసి ‘క్వాడ్‌’ కూటమిని ఏర్పాటుచేసుకున్నాయి. ఇందులో భారత్‌ భాగస్వామ్యపక్షంగా చేరేలా ఒప్పించిందే అమెరికా.

Published : 05 Feb 2024 04:55 IST

కూటమి విషయంలో జపాన్‌ను ప్రోత్సహించొద్దని నాడు మన్మోహన్‌కు సూచన

జైపుర్‌: ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దుందుడుకుతనానికి కళ్లెం వేసేందుకు భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా కలిసి ‘క్వాడ్‌’ కూటమిని ఏర్పాటుచేసుకున్నాయి. ఇందులో భారత్‌ భాగస్వామ్యపక్షంగా చేరేలా ఒప్పించిందే అమెరికా. అలాంటి అమెరికా.. ఓ దశలో క్వాడ్‌ విషయంలో ఉత్సాహం ప్రదర్శించకుండా జపాన్‌ను నిలువరించాలనుకుంది! అందుకోసం భారత్‌తో చెలిమిని ఉపయోగించుకోవాలని భావించింది!! 2004-06 మధ్య భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్యామ్‌ శరణ్‌ స్వయంగా ఈ వివరాలను వెల్లడించారు. జైపుర్‌ సాహిత్య ఉత్సవం (జేఎల్‌ఎఫ్‌)లో భాగంగా శనివారం ‘క్వాడ్‌, ఇండో-పసిఫిక్‌ కొత్త దార్శనికత’ అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఓసారి జపాన్‌ పర్యటనకు సిద్ధమయ్యారు. ఆయన పర్యటనకు ముందు అమెరికా స్నేహితులు నన్ను సంప్రదించారు. ‘క్వాడ్‌ విషయంలో ముందుకెళ్లేలా షింజో అబె (అప్పటి జపాన్‌ ప్రధాని)ను ప్రోత్సహించొద్దని మీ ప్రధానికి చెప్పండి. క్వాడ్‌ను ప్రోత్సహించేందుకు ఇది సమయం కాదు’ అని వారు నాతో అన్నారు. నాకు ఆశ్చర్యమనిపించింది. ‘జపాన్‌ మీ మిత్రదేశం. మీరే ఆ దేశ ప్రధానితో నేరుగా మాట్లాడొచ్చు కదా! క్వాడ్‌ గొప్ప వేదిక అవుతుందంటూ మేం భాగస్వామ్యపక్షంగా చేరేందుకు ఒప్పించిందే మీరు. అలాంటి మీరు ఇప్పుడెందుకు దీనిపై వెనుకంజ వేస్తున్నారు?’ అని ప్రశ్నించాను. దానికి వారు స్పందిస్తూ.. ‘ఇరాన్‌ అణు కార్యకలాపాల వ్యవహారం ఇప్పుడు భద్రతామండలి ముందుంది. ఈ విషయంలో మాకు చైనా మద్దతు కావాలి. ఉత్తర కొరియా వ్యవహారంలోనూ చర్చల్ని పునరుద్ధరించాలని మేం అనుకుంటున్నాం. కాబట్టి క్వాడ్‌ను కొన్నాళ్లు పక్కనపెడదాం. మేమేమీ వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతానికి వేచి చూద్దామంటున్నాం. అంతే!’ అని వివరించారు. ‘క్వాడ్‌ అనే వేదిక మీ చొరవతో ముందుకొచ్చిందే. కానీ దానికి ఇది సరైన తరుణం కాదని మీరు భావిస్తున్నారు. కాబట్టి మీ ఇష్టమే’ అని నేను వారికి బదులిచ్చాను’’ అని శ్యామ్‌ శరణ్‌ వివరించారు.


క్వాడ్‌ డ్రైవర్‌ సీటులో భారత్‌

అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి వ్యాఖ్య

జైపుర్‌: చతుర్భుజ కూటమి- క్వాడ్‌లో భారత్‌ అత్యంత కీలకమైన డ్రైవర్‌ సీటులో ఉందని మన దేశంలో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి వ్యాఖ్యానించారు. దాని తర్వాతి సీటులో అమెరికా ఉందని పేర్కొన్నారు. జైపుర్‌ సాహిత్య ఉత్సవం (జేఎల్‌ఎఫ్‌)లో ‘క్వాడ్‌, ఇండో-పసిఫిక్‌ కొత్త దార్శనికత’ అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. క్వాడ్‌లో భారత్‌తో పాటు అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా భాగస్వామ్య పక్షాలు. ఈ కూటమి ప్రయాణ మార్గాన్ని నిర్దేశించే విషయంలో జపాన్‌ ముందు నుంచీ కీలకంగా వ్యవహరిస్తోందని గార్సెట్టి తెలిపారు. ఆస్ట్రేలియా క్వాడ్‌ అవసరాలను, ప్రయాణ దిశను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందని వివరించారు. ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి మాల్కమ్‌ టర్న్‌బుల్‌ మాట్లాడుతూ.. క్వాడ్‌ పూర్తిస్థాయిలో వ్యూహాత్మక భాగస్వామ్యంగా అవతరించకపోవడానికి కారణాల గురించి ఆలోచించడం వ్యర్థమన్నారు. ఇప్పటిదాకా సాధించిన పురోగతి సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని