మార్చి 2 నాటికి పాక్‌లో కొత్త ప్రభుత్వం!

అధికార పంపిణీకి సంబంధించి ఓ ఒప్పందానికొచ్చిన పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీలు వచ్చే నెల రెండో తేదీ నాటికి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసేందుకు, మార్చి తొమ్మిదో తేదీలోగా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.

Updated : 24 Feb 2024 04:26 IST

తొమ్మిదో తేదీకి ముందుగానే అధ్యక్ష ఎన్నికలు

ఇస్లామాబాద్‌: అధికార పంపిణీకి సంబంధించి ఓ ఒప్పందానికొచ్చిన పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీలు వచ్చే నెల రెండో తేదీ నాటికి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసేందుకు, మార్చి తొమ్మిదో తేదీలోగా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌)కు మాజీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి బిలావల్‌ భుట్టో-జర్దారీకి చెందిన పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ మద్దతు ఇస్తోంది. ఫిబ్రవరి ఎనిమిదో తేదీ నాటి లెక్కింపులో పాక్‌లోని ఏ ఒక్క పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేంత స్థాయిలో ఆధిక్యం దక్కలేదు. దీంతో హంగ్‌ తప్పని పరిస్థితి నెలకొంది. మాజీ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ (72) మళ్లీ ప్రధాని పీఠాన్ని అలంకరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పీఎంఎల్‌-ఎన్‌ అధ్యక్షుడిగా ఉన్న షెహబాజ్‌ను ప్రధాని పదవికి నామినేట్‌ చేయాలని ఆయన అన్నయ్య అయిన నవాజ్‌ నిర్ణయించడమే ఇందుకు కారణం. పార్లమెంటులో తమ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ లేనందున ప్రభుత్వాన్ని నడిపేందుకు నవాజ్‌ సుముఖంగా లేనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు పార్టీలు జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మద్దతు గల అభ్యర్థుల కంటే తక్కువ సంఖ్యలో సీట్లు గెలుచుకున్నాయి. దేశవ్యాప్తంగా కొత్త ఎన్నికైన అసెంబ్లీలు ఈ నెల 29న ప్రమాణం చేస్తాయని, రెండో తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ న్యూస్‌ ఇంటర్నేషనల్‌ తెలిపింది. అనంతరం తొమ్మిదో తేదీ లోగా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని